చికిత్స పొందుతున్న మైనర్ బాలికను పరామర్శించిన మంత్రి తుమ్మల
చికిత్స పొందుతున్న మైనర్ బాలికను పరామర్శించిన మంత్రి తుమ్మల
ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా..
మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ అధికారులకు ఆదేశాలు
ఖమ్మం, (ఆంధ్రప్రభ): ఖమ్మం నగరంలో లైంగిక దాడికి గురై తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆమెకు అందుతున్న వైద్య సేవలపై ఆస్పత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
నిమ్స్ డైరెక్టర్ రాహుల్‌తో మాట్లాడిన మంత్రి, బాలికకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. చికిత్సకు సంబంధించి ఎలాంటి పరిస్థితి ఎదురైనా వెంటనే తనకు సమాచారం అందించాలని సూచించారు.
బాలిక తల్లిదండ్రులతో మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బాలిక త్వరగా కోలుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అలాగే ఐసీడీఎస్ అధికారులతో మాట్లాడిన మంత్రి, బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా ప్రత్యేకంగా చూసుకోవాలని ఆదేశించారు. వారి అవసరాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు.
బాలిక ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు మంత్రి భరోసా కల్పిస్తూ, మెరుగైన వైద్యం కోసం ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నిమ్స్ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, బాలిక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వం బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
