SIR process | ఎస్‌ఐఆర్‌పై రాజకీయాలు వద్దు…

SIR process | ఎస్‌ఐఆర్‌పై రాజకీయాలు వద్దు…

SIR process | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: గతంలో ఎస్‌ఐఆర్‌ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) నిర్వహించినప్పుడు మద్దతు తెలిపిన ప్రతిపక్షాలు, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించారు.

సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి మండలం మాత్‌పల్లిలో నిర్వహిస్తున్న బీజేపీ జిల్లా స్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఓటు హక్కు ఉన్న ప్రాంతంలోనే ఓటు వినియోగించేందుకు అవకాశం కల్పించడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ ఎదుగుతుండటంతో ప్రజలు ఆ పార్టీని విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులు, విద్యార్థులు, ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలను మోసం చేశాయని ఆరోపించారు.

ఈ సందర్భంగా మెదక్ ఎంపీ ఎం. రఘునందన్‌రావు మాట్లాడుతూ… ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసమే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. దీనిని రాజకీయ కోణంలో చూడకుండా ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని సూచించారు. ఎస్‌ఐఆర్ అమలులో ప్రభుత్వం పూర్తిస్థాయి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply