మాదకద్రవ్యాల వినియోగం నివారణ అవగాహన కార్యక్రమం..
మాదకద్రవ్యాల వినియోగం నివారణ అవగాహన కార్యక్రమం..
మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన ద్వారానే వాటి వినియోగాన్ని నివారించవచ్చన్న…జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
విద్యార్థి దశ జీవితాన్ని తీర్చిదిద్దే అత్యంత కీలకమైన సమయమని, మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా తమ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చిన… ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్.
డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం ద్వారా యువతలో చైతన్యం తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న… ఎమ్మెల్యే బడేటి చంటి.
ఏలూరు, ఆంధ్ర ప్రభ : మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన ద్వారానే వాటి వినియోగాన్ని నివారించవచ్చని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అభిప్రాయపడ్డారు. నషాముక్త్ భారత అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల వినియోగం నివారణ అవగాహన కార్యక్రమంలో జిల్లా లోని వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసే సిబ్బందికి, పోలీస్ సిబ్బంది, పాత్రికేయుల మధ్య నిర్వహించిన క్రికెట్ క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు శనివారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) లతో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలు జోలికి పోకుండా చూడవలసిన గురుతరమైన బాధ్యత మనందరిపై ఉందన్నారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అవగాహన ద్వారానే మాదకద్రవ్యాల వినియోగాన్ని నివారించగలమని, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా యువతలో మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే నష్టాలపై విస్త్రృతంగా అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మన జిల్లాను మార్చడానికి అందరి బాగస్వామ్యం ఎంతో కీలకమని, ఈ దిశగా సమాజంలోని ప్రతీ ఒక్కరూ కృషిచేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ, విద్యార్థి దశ జీవితాన్ని తీర్చిదిద్దే అత్యంత కీలకమైన సమయమని, ఈ దశలో మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా తమ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. గంజాయి వంటి మాధకద్రవ్యాలు వాహనాలు, బస్సులు, రైళ్ల ద్వారా రవాణా జరగకుండా నియంత్రిస్తున్నామని, రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. మాదకద్రవ్యాల సమాచారం తెలిసిన వెంటనే నేషనల్ డెడికేషన్ హెల్ప్ లైను నెంబరు 14446, ఈగల్ టోల్ ఫ్రీ నెంబరు 1972 సంప్రదించాలని, ఫోన్ చేసిన తక్షణం టీమ్లు క్షేత్రస్థాయిలోకి అడుగుపెట్టి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. తొలి దశలోనే జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను అతి సులువుగా తప్పించ వచ్చునని తెలిపారు.
ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ చెడు స్నేహలు వల్ల పిల్లలు దొంగతనాలు, మత్తు పదార్థాలకు అలవాటు పడతారని, పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఎక్కువ దృష్టి పెట్టాలని కోరారు. డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం ద్వారా యువతలో చైతన్యం తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి డిఅడిక్షన్ సెంటర్ల ద్వారా చికిత్స అందించడం జరుగు తుందన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయించ కుండా ఔషధ దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలన్నారు. క్రికెట్ పోటీలలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన పోలీస్, స్వర్ణ గ్రామ,వార్డ్ సచివాలయాలు, గృహ నిర్మాణ శాఖ సిబ్బంది కి మెమొంటోలు కలెక్టర్ అందించారు.
ఈ సందర్భంగా జిల్లాలో గంజాయి రవాణా ను అడ్డుకుని, నియంత్రణలో ప్రతిభ కనపరచిన డివిజన్ స్థాయి పోలీస్ సిబ్బందిని అభినందిస్తూ కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే లు మెమెంటోలను అందించారు.
మాదకద్రవ్యాల వినియోగం నియంత్రణ పై పాఠశాల, కళాశాల స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, వ్రక్తృత్వ పోటీలలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం నివారణ పై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాదకద్రవ్యాల వినియోగం నివారించాలంటూ చేపట్టిన సంతకాల కేంపెయిన్ పై కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే లు సంతకాలు చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ జెడి విశ్వమోహన్ రెడ్డి, ఐసిడిఎస్ పీడీ శారద, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి. రామ్ కుమార్, సర్వశిక్షా అభియాన్ ఏపిడి పంకజ్ కుమార్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గిరిబాబు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అజీజ్, డిఎస్పీ శ్రావణ్ కుమార్, డీసీపీఓ సూర్యచక్రవేణి, ఎన్జీఓ నాయకులు చోడగిరి శ్రీనివాస్, పాల్గొన్నారు.
