ఎండ తీవ్రతపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

ఎండ తీవ్రతపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

  • వృద్ధులు, దివ్యాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
  • జిల్ల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశం

ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ:
జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం స్థానిక జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ నుండి ఎండ తీవ్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆమె పలు సూచనలు జారీ చేశారు. రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 26వ తేదీ వరకూ తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ అత్యవసరమైతేనే బయటకు రావాలని, అలా వచ్చే వారు తగినంత తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణాలు తీసుకోవాలని సూచించారు. శరీర ఉష్ణోగ్రత పెరగడం, అధిక దాహం, తలనొప్పి, వాంతులు, అలసట వంటి వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గర్లో ఉన్న వైద్య కేంద్రాలను సంప్రదించాలన్నారు.

ఎండ తీవ్రతపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని, ఎటువంటి చిన్న పొరపాటు జరిగినా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయ, ఉద్యానవన పంటలు, మూగజీవాలను డ్రోన్ల ద్వారా సర్వే చేసి నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. దివ్యాంగులు, వృద్ధులు ఎండలో తిరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా దివ్యాంగుల సహాయ సంచాలకులను ఆదేశించారు. ముఖ్యమైన కూడళ్లలో చలివేంద్రాలు, ప్రయాణికుల కోసం తాత్కాలిక పందిళ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్ఎస్సీ తదితర పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. వేసవిలో కరెంట్ కోతలు, లో-వోల్టేజీ సమస్యలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

చేపలు, రొయ్యల చెరువుల వద్ద ఎండ సమయాల్లో పనులు చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా మత్స్యశాఖ డీడీని, పరిశ్రమల్లో రసాయనిక పదార్థాల వద్ద ప్రమాదాలు జరగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లాకు కొత్తగా వచ్చిన వాహనాలను సద్వినియోగం చేసుకుంటూ ఎలాంటి సమాచారం వచ్చినా వెనువెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలా సిద్ధంగా ఉండాలని సూచించారు. పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఏలూరు, నూజివీడు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్లు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని, పంట పొలాల్లో వ్యర్థాలను కాల్చకుండా నివారించాలన్నారు.

తాగునీటి సమస్యలు తలెత్తకుండా మున్సిపల్, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆరోగ్య శాఖ అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్లను అందుబాటులో ఉంచాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో తాగునీటి సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. ఎండ తీవ్రతపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని డీపీఆర్వోను ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

Leave a Reply