తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీక

తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీక
ఏలూరు, ఆంధ్రప్రభ : తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి డా. నందమూరి తారక రామారావు అని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కొనియాడారు.
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు గురువారం కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, ఎన్టీఆర్ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అనేక పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. సామాజిక పెన్షన్లు, మహిళలకు ఆస్తిలో హక్కు, పేదల ఆరోగ్య భద్రత కోసం 2 రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలు ఆయన పాలనలోనే అమలయ్యాయని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగానే కాకుండా నటుడిగా కూడా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని, ఆయన నటనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని చెప్పారు. ప్రజలకు మెరుగైన, సంతృప్తికరమైన సేవలు అందించడమే ఆయన పాలన లక్ష్యమని అన్నారు.
దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, పేదలు, రైతుల సంక్షేమానికి ఎన్టీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారని గుర్తుచేశారు.
సామాజిక పెన్షన్లను ఎన్టీఆర్ ప్రారంభించగా, ప్రస్తుతం అవి పెరిగి మరింత విస్తరించాయని తెలిపారు. పేద ప్రజలకు కూడు, గూడు, నీడ కల్పిస్తానని చెప్పి అమలు చేసి చూపించిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ, ఇన్‌చార్జ్ డీఆర్వో దేవకీదేవి, ఆర్డీఓ కె. లక్ష్మీప్రసన్న, ఎస్డీసీ భాస్కర్, సెట్ వెల్ సీఈఓ ప్రభాకర్, పర్యాటక అధికారి పట్టాభి రామయ్య, ఐసీడీఎస్ పీడీ శారద, ఎల్డీఎమ్ నీలాద్రి, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
