Medical Student | అదే గ్రామంలో రామ్ చరణ్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య..

కలకలం రేపుతున్న ఇద్దరి మరణాలు.
యువతిని చంపి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రచారం.
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో ఘటన.

Medical Student | నకిరేకల్, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఒకేరోజు యువతీ యువకుల మరణాలు కలకలం రేపాయి. వీరిద్దరూ ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్యలు చేసుకున్నారా లేక యువతిని చంపిన యువకుడు భయంతో ఆత్మహత్య చేసుకున్నాడా అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్న (20) అనే యువతీ సూర్యాపేట మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ప్రధాన సంవత్సరం పూర్తి చేసింది. ఈమె రోజు స్వగ్రామం నుండి కళాశాలకు వెళ్లి వచ్చేది. ఈమె శుక్రవారం రాత్రి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది. తెల్లారేసరికి ఇదే గ్రామానికి చెందిన రామ్ చరణ్ (22) గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

వీరి వరస మరణాలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. గత కొంతకాలంగా రామ్ చరణ్ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో యువకుడు ఆమెను హత్య చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అనంతరం ఆందోళనకు గురైన రామ్ చరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా రామ్ చరణ్ గత కొంతకాలంగా తమ కూతురిని ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు తల్లి పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు కారణాలు ఏమిటన్నది విచారణ అనంతరం వెల్లడిస్తామని కట్టంగూరు ఎస్సై రవీందర్ చెప్పారు.