RAW NTR |రూ.100కోట్ల సేవా యజ్ఞం.. విరాళాల కోసం కాదు..
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సేవలో ఎప్పుడూ ముందుంటాం
రిజిస్టర్డ్ ఎన్జీవో ద్వారానే నిధుల సమీకరణ
ఎన్టీఆర్ పేరు చెప్పి ఎవరూ డబ్బులు ఇవ్వొద్దని విజ్ఞప్తి
సీఎస్సార్ నిధులతో గ్రామాభివృద్ధే లక్ష్యం
రా ఎన్టీఆర్ అభిమానుల సంఘం అధ్యక్షుడు సాయి స్వరూప్
RAW NTR | ఆంధ్రప్రభ, తిరుపతి : జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సమాజ సేవలోనూ ప్రత్యేక గుర్తింపు సాధించారని రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్, గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఎన్జీవో అధ్యక్షుడు సాయి స్వరూప్ తెలిపారు. శనివారం తిరుపతి స్థానిక ప్రైవేట్ హోటల్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తమ సంస్థ ఉచిత ప్రచారం కోసం కానీ, వ్యక్తిగత గుర్తింపు కోసం కానీ పనిచేయడం లేదని, సమాజానికి శాశ్వత ప్రయోజనం చేకూర్చే సేవా కార్యక్రమాలే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సోషల్ ఇంపాక్ట్ ఇనిషియేటివ్‌లో భాగంగా కార్పొరేట్ సంస్థల సీఎస్సార్ నిధుల ద్వారా రూ.100 కోట్ల విలువైన గ్రామీణాభివృద్ధి పనులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ రూ.100 కోట్ల సేవా యజ్ఞం అంటే ప్రజల నుంచి విరాళాలు సేకరించడం కాదని, పూర్తిగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడమే తమ ఉద్దేశమని వివరించారు.
తమ సంస్థ వద్ద రూ.100 కోట్లు లేవని, సామాన్యులమైన తమలాంటి వారు అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చడం సాధ్యం కాదని అన్నారు. అందుకే గ్రామాల్లో ఉన్న అవసరాలను గుర్తించి, గ్రామ కమిటీలతో కలిసి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు సిద్ధం చేసి, వాటిని కార్పొరేట్ సంస్థలకు అధికారికంగా సమర్పించి సీఎస్సార్ నిధులు తీసుకురావడమే తమ కార్యాచరణ అని తెలిపారు.2020 కరోనా మహమ్మారి సమయంలో తమ సంస్థకు చెందిన 27 మంది వాలంటీర్లు ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేశారు. లాక్‌డౌన్ సమయంలో ఉచిత ఆహారం, ఉచిత మందులు అందించడంతో పాటు అవసరమైన కుటుంబాలకు నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేశామని తెలిపారు. ఆ సేవల స్ఫూర్తితోనే సమాజానికి మరింత ఉపయోగపడే కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన చిన్నచిన్న వసతులు కల్పించామని, ఏడాది క్రితమే “ఎన్టీఆర్ మీల్స్” కార్యక్రమాన్ని ప్రారంభించి నిరుపేదలకు భోజనం అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో విద్య, ఆరోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, పాఠశాల మౌలిక వసతులు వంటి రంగాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.సెంటిమెంట్ పేరుతో ప్రజల నుంచి విరాళాలు సేకరించడం తమ విధానం కాదని, అభిమానుల భావోద్వేగాలతో ఆడుకునే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ప్రతి రూపాయికి పూర్తి లెక్క ఉంటుందని, రిజిస్టర్డ్ ఎన్జీవో ద్వారా మాత్రమే నిధుల నిర్వహణ జరుగుతుందని, క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహించి పూర్తి పారదర్శకత పాటిస్తామని తెలియజేశారు.
వ్యక్తుల పేరుతో కాకుండా సంస్థ పేరుతోనే సీఎస్సార్ నిధులు సమీకరిస్తామని తెలిపారు.జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పి ఎవరూ ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు వెచ్చించే సీఎస్సార్ నిధుల్లో ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 4–5 శాతం మాత్రమే వస్తోందని, ఆ నిధులను రాష్ట్ర గ్రామీణాభివృద్ధికి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. గ్రామస్థులు, గ్రామ కమిటీలు, వాలంటీర్ నెట్‌వర్క్‌తో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తామని పేర్కొన్నారు.చిన్న అభిమానులను కూడా ఆప్యాయంగా కలిసే జూనియర్ ఎన్టీఆర్, సమాజ సేవ చేస్తున్న తమలాంటి అభిమాన సంఘ ప్రతినిధులను కూడా ఒకసారి కలిస్తే ఎంతో సంతోషంగా ఉంటుందని అన్నారు. మంచి పనులు చేయడానికి ప్రత్యేక అనుమతులు అవసరం లేదని, సేవాభావం ఉంటే సమాజంలో గొప్ప మార్పు తీసుకురావచ్చని ఆయన పేర్కొన్నారు.

