తెలంగాణ ఉద్యమ యోధులకు ఘన నివాళి

జయశంకర్ జయంతి, గద్దర్–సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన నాయకులు

మేడ్చల్, ఆంధ్రప్రభ: తెలంగాణ మలి ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా విశేష పాత్ర పోషించిన ఉద్యమ యోధులకు మేడ్చల్‌లో గురువారం ఘనంగా నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, ప్రజా గాయకుడు గద్దర్, మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ వర్ధంతి, ఇటీవల మృతి చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్మారకార్థం నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతపరమైన బలాన్ని అందించగా, గద్దర్ తన పాటల ద్వారా ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపారని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ భావజాలాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడంలో విశేష కృషి చేశారని పేర్కొన్నారు.

మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అందించిన మద్దతు చిరస్మరణీయమని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమకారుల త్యాగాలు, నాయకుల చిత్తశుద్ధి ఫలితమని, తెలంగాణ మలి ఉద్యమం మరో స్వాతంత్ర్య పోరాటంతో సమానమని అభివర్ణించారు. సాధించుకున్న తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బాల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, విగ్రహ కమిటీ సభ్యులు సత్యపాల్ రెడ్డి, ప్రవీణ్, భద్ర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, చాప రాజు, నాయకులు రాఘవేందర్ గౌడ్, నవీన్ రెడ్డి, దేవా, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రమేష్, బీపీటీ రాజు, జగన్ రెడ్డి, కౌడె మహేష్, కరెంట్ శంకర్, సంతోష్ గౌడ్, సాయి, మురళి, రాజిరెడ్డి, రమేష్ సంజీవరావు, రేగు రాజు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.