మేడ్చల్‌లో బైక్ దొంగల అరెస్ట్

మేడ్చల్‌లో బైక్ దొంగల అరెస్ట్
- మూడు మోటార్ సైకిళ్లు స్వాధీనం
మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్థులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి మూడు చోరీ బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కడమంచి శ్రీహరి (22), పర్నంది అశోక్ (56) కోవిడ్ సమయంలో పరిచయమై, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మేడ్చల్ ప్రాంతంలో రాత్రివేళల్లో ఒంటరిగా పార్క్ చేసిన బైక్‌లను లక్ష్యంగా చేసుకున్నారు. హ్యాండిల్ లాక్‌లు విరగ్గొట్టి వాహనాలను ఎత్తుకెళ్లడం వీరి పద్ధతిగా పోలీసులు తెలిపారు.
ఏప్రిల్ 30న మేడ్చల్ బస్ డిపో సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని పోలీసులు తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. సరైన పత్రాలు చూపకపోవడంతో పాటు తప్పించుకోవడానికి ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా మూడు చోరీల గురించి ఒప్పుకున్నారు. నిందితుల నుండి రెండు ప్యాషన్ ప్రో బైక్‌లు (AP12N3941, AP29AL8808), ఒక యూనికార్న్ బైక్ (TS08FW6499)ను పోలీసులు రికవరీ చేశారు.
ఈ కేసును ఛేదించిన మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ ఏ. సత్యనారాయణ, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ పి. కిరణ్ బృందాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, డీసీపీ కోటిరెడ్డి అభినందించారు. వాహనదారులు తమ మోటార్ సైకిళ్లను వెలుతురు ఉన్న ప్రదేశాల్లో, సీసీ కెమెరాల నిఘాలో పార్క్ చేయాలని, అదనపు సేఫ్టీ లాక్‌లు ఉపయోగించాలని మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి సూచించారు.
