జయశంకర్ ఆశయాలు ఆదర్శప్రాయం

గోదావరిఖని, ఆంధ్రప్రభ: తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలు తెలంగాణ ప్రజలకు చిరస్మరణీయ ఆదర్శమని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. గురువారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి, ఇన్‌చార్జి కమిషనర్, అదనపు కలెక్టర్ అరుణశ్రీ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జయశంకర్ చేసిన కృషి చిరస్మరణీయమని, తన జీవితాన్నే తెలంగాణ కోసం అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలను ఏకం చేసిన జయశంకర్ ఆలోచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గట్ల రమేష్, ముస్తఫా, సతీష్‌తో పాటు కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.