తప్పిపోయిన బాలుడు.. గంటల వ్యవధిలోనే తల్లిదండ్రుల చెంతకు
తప్పిపోయిన బాలుడు.. గంటల వ్యవధిలోనే తల్లిదండ్రుల చెంతకు
- మానవత్వం చాటుకున్న మేడ్చల్ పోలీసులు
- తప్పిపోయిన 1.5 ఏళ్ల బాలుడు సురక్షితం
- పోలీసుల చొరవ, వాట్సాప్ గ్రూపుల సమన్వయం.. గంటల్లోనే తల్లిదండ్రుల వద్దకు చేరిన చిన్నారి
- మేడ్చల్ పోలీసుల క్విక్ యాక్షన్
మేడ్చల్, ఆంధ్రప్రభ: మేడ్చల్ మార్కెట్ పరిధిలో బుధవారం తప్పిపోయిన ఒకటిన్నర సంవత్సరాల బాలుడిని మేడ్చల్ పోలీసులు అత్యంత వేగంగా స్పందించి, సురక్షితంగా అతని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ మార్కెట్ ఏరియాలో ఒక చిన్నారి ఒంటరిగా తిరుగుతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మేడ్చల్ సీఐ సత్యనారాయణ నేతృత్వంలోని పోలీసు బృందం వెంటనే రంగంలోకి దిగి, బాలుడిని సురక్షితంగా పోలీస్ స్టేషన్‌కు తరలించింది. అనంతరం బాలుడి ఫోటోను స్థానిక పోలీస్ నెట్‌వర్క్, కమ్యూనిటీ వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా సర్క్యులేట్ చేశారు.
సమష్టి సమన్వయం, ప్రజల సహకారంతో కొద్దిసేపట్లోనే బాలుడి తల్లిదండ్రులను గుర్తించారు. తమ బిడ్డ క్షేమంగా ఉన్నాడని తెలుసుకున్న తల్లిదండ్రులు మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా, సీఐ సత్యనారాయణ చేతుల మీదుగా బాలుడిని వారికి అప్పగించారు. కళ్లెదుటే ఉన్న బిడ్డను చూసి తల్లిదండ్రులు తీవ్ర భావోద్వేగానికి గురవుతూ, సకాలంలో స్పందించి తమ బిడ్డను కాపాడిన మేడ్చల్ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా చిన్న పిల్లలు ఒంటరిగా లేదా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లోగానీ, లేదా ‘డయల్ 100’ హెల్ప్‌లైన్‌కు గానీ సమాచారం అందించాలని మేడ్చల్ సీఐ సత్యనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

