Manchu Manoj | ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ‘రా కింగ్’
Manchu Manoj | ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ‘రా కింగ్’
దాసరి ఘాట్ పునరుద్ధరణకు మనోజ్ ముందడుగు
Manchu Manoj | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : లెజెండరీ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావుపై తనకున్న గౌరవాన్ని నటుడు మనోజ్ మంచు మరోసారి చాటుకున్నారు. దాసరి ఘాట్ దుస్థితికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే స్పందించిన మనోజ్, స్వయంగా అక్కడికి చేరుకుని పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఆయన చర్యకు సినీ అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
యాంకర్ గౌతమి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో దాసరి ఘాట్ పరిసరాల దయనీయ పరిస్థితి కనిపించడంతో మనోజ్ మంచు స్పందించారు. ‘‘దాసరి గారి ఘాట్ చుట్టూ ఉన్న పరిస్థితి చూసి చాలా బాధ కలిగింది. తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. నా వంతు సహాయం తప్పకుండా చేస్తాను’’ అంటూ సోషల్ మీడియాలో హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం మరుసటి రోజే ఉదయం తన బృందంతో కలిసి దాసరి ఘాట్‌ను సందర్శించారు. అక్కడ పేరుకుపోయిన చెత్త, ఎండుటాకులను తొలగిస్తూ శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ‘‘మూడు, నాలుగేళ్ల క్రితం ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఈ పరిస్థితి చూసి తట్టుకోలేకపోయాను. అందుకే షూటింగ్‌కు వెళ్లే ముందు ఇక్కడికి వచ్చి ఈ పనిని ప్రారంభించాను’’ అని మనోజ్ తెలిపారు.
ఇటీవల మనోజ్, మౌనికా కలిసి ప్రారంభించిన ‘ఐక్య ధైర్య సేనా సమితి’ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రక్తదాన శిబిరాలు, సహాయక కార్యక్రమాలు, అనాథాశ్రమాల సందర్శనలతో పాటు ఇప్పుడు దాసరి నారాయణరావు ఘాట్ పునరుద్ధరణలోనూ ముందుండడం ఆయన సామాజిక బాధ్యతను చాటుతోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

