మహానాడు–2026 చరిత్ర సృష్టించింది
మహానాడు–2026 చరిత్ర సృష్టించింది
- పల్లా శ్రీనివాసరావు
అమరావతి, ఆంధ్రప్రభ: మహానాడు–2026 ఘన విజయంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మహానాడు గిన్నిస్ రికార్డు స్థాయిలో విజయవంతమవుతుందని తాను ముందుగానే చెప్పానని, అయితే కార్యకర్తలు తన అంచనాలకు మించి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.
ఇది కేవలం రాజకీయ సమావేశం కాదని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అంకితభావం, క్రమశిక్షణ, సాంకేతికతపై ఉన్న అవగాహన, పార్టీపై ఉన్న ప్రేమకు ప్రతీకగా నిలిచిందన్నారు.దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ నిర్వహించిన అతిపెద్ద డిజిటల్ రాజకీయ మహాసభగా మహానాడు–2026 నిలిచిందని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. 1,875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారని చెప్పారు. 24.50 లక్షల మంది వర్చువల్‌గా భాగస్వామ్యం కావడం ద్వారా మహానాడు సరికొత్త రికార్డులు సృష్టించిందన్నారు.
పొదుపు చర్యల్లో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు, ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
కార్యకర్తలే తెలుగుదేశం అసలైన బలం
1982లో పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీని మోసింది, మోస్తోంది, భవిష్యత్తులో మోయబోయేది కార్యకర్తలేనని పల్లా శ్రీనివాసరావు అన్నారు. సిద్ధాంతం కోసం, జెండా కోసం, నాయకత్వం కోసం ప్రాణాలు సైతం అర్పించే కార్యకర్తల సైన్యం తెలుగుదేశం పార్టీకి సొంతమని చెప్పారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వేధింపులు, అక్రమ కేసులు, ఆర్థిక నష్టాలు ఎదురైనా పార్టీ జెండాను వదలకుండా నిలిచిన ప్రతి కార్యకర్తకు పాదాభివందనం చేస్తున్నామని అన్నారు. “జై తెలుగుదేశం” అంటూ ప్రాణత్యాగం చేసిన కార్యకర్తల త్యాగాల పునాదులపైనే ఈ పార్టీ నిలిచిందని పేర్కొన్నారు.
‘కార్యకర్తే అధినేత’ నినాదాన్ని ఆచరణలో చూపిన చంద్రబాబు
పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మరోసారి “కార్యకర్తే అధినేత” అన్న నినాదాన్ని ఆచరణలో చూపించారని పల్లా తెలిపారు. కార్యకర్తల సంక్షేమం కోసం రూ.160 కోట్లకు పైగా ఖర్చు చేయడం, వారి కుటుంబాల విద్య, నైపుణ్యాభివృద్ధి, సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయడం చంద్రబాబు నాయకత్వ ప్రత్యేకత అని అన్నారు.
డిజిటల్ రాజకీయాలకు లోకేష్ కొత్త దారి
హైబ్రిడ్ మహానాడును విజయవంతంగా నిర్వహించడంలో పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కృషి ఉందని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సాంకేతికతను రాజకీయ వ్యవస్థతో అనుసంధానం చేస్తూ, ప్రతి కార్యకర్తను నేరుగా నాయకత్వంతో కలిపిన ఈ విధానం దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందన్నారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌పై చారిత్రాత్మక నిర్ణయం
మహానాడు–2026లో తీసుకున్న కీలక నిర్ణయాల్లో మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్ ఒకటని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. మహిళా సాధికారతకు ఎన్టీఆర్ పునాది వేయగా, చంద్రబాబు ఆర్థిక స్వావలంబన కల్పించారని అన్నారు. ఇప్పుడు నారా లోకేష్ మహిళలను రాజకీయ నిర్ణయాధికార కేంద్రంలోకి తీసుకువచ్చే నిర్ణయం ప్రతిపాదించారని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్లపై చర్చలు జరుగుతున్న తరుణంలో, ఒక రాజకీయ పార్టీ తన సంస్థాగత నిర్మాణంలో, ఎన్నికల రాజకీయాల్లో 33 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తామని ప్రకటించడం ముఖ్యమైన సంస్కరణ అని అన్నారు. ఇది కేవలం రిజర్వేషన్ మాత్రమే కాదని, మహిళలకు రాజకీయ అధికారం పంచే నిర్ణయమని చెప్పారు.
మహానాడులో 21 తీర్మానాలు
మహానాడు వేదికగా 21 కీలక తీర్మానాలు ఆమోదించామని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరడం నుంచి మహిళా సాధికారత, యువత ఉపాధి, బీసీల అభ్యున్నతి, సామాజిక న్యాయం, సాంకేతిక అభివృద్ధి వరకు అనేక అంశాలపై చర్చ జరిగిందన్నారు.
వివిధ తీర్మానాలపై 88 మంది నాయకులు, కార్యకర్తలు ప్రసంగించడం మహానాడుకు ప్రత్యేకతగా నిలిచిందని పేర్కొన్నారు.
మహానాడు తీర్మానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మహానాడు విజయంతో ప్రయాణం ముగియలేదని పల్లా శ్రీనివాసరావు అన్నారు. మహానాడులో తీసుకున్న తీర్మానాలు, ప్రభుత్వ విజయాలు, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
మహానాడు–2026ను విజయవంతం చేసిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, నాయకులు, కార్యకర్తలు, సాంకేతిక బృందాలు, ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పల్లా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.
