Mahabubnagar | మరో 25 కులాలకు న్యాయం చేయాలి…

Mahabubnagar | మరో 25 కులాలకు న్యాయం చేయాలి…

Mahabubnagar | ఊట్కూర్, ఆంధ్రప్రభ : మాలల కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 1000 కోట్ల నిధులు కేటాయించాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కే నారాయణ డిమాండ్ చేశారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల(Ootkur Mandal) పరిధిలోని కొల్లూర్ లో మాలల రణభేరి కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 23న నిర్వహించే రణభేరి మహాసభకు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం(State Government) ప్రస్తుత జనాభా లెక్కలు లేకుండా, ఎలాంటి ఎంపరికల్ డేటా తీసుకోకుండా సుప్రీం కోర్టు సూచనలను పాటించకుండా 2011 జనాభా లెక్కల తో వర్గీకరణ చేసిందని, రోస్టర్ పాయింట్ల కేటాయింపు లోను మాలలకు తీవ్ర నష్టం జరిగేలా సబ్ కమిటీ సభ్యులు కుట్రపూరితంగా చేశారని, 5 శాతం కేటాయించిన గ్రూప్ 3లోని మాలలకు, 1 శాతం ఉన్న గ్రూప్ 1లోని వారికంటే తక్కువ ఉద్యోగాలు వస్తున్నాయంటే 1 శాతం కంటే తక్కువ రిజర్వేషన్ ను మాలలకు కేటాయించడం ఇదేనా కాంగ్రెస్ సామాజిక న్యాయం అని ప్రశ్నించారు.

సుప్రీంకోర్టు(Supreme Court) సూచనలకు విరుద్ధంగా 2011 జనాభా లెక్కలతో సరైన ఎంపెరికల్ డేటా లేకుండా కులాల వారిగా చేసిన ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేశారు. రోస్టర్ పాయింట్ల కేటాయింపును పున: సమీక్షించి జీవో 99(G.O. 99)ని సవరించి మాలలతో పాటు గ్రూప్ త్రీ లో ఉన్న మరో 25 కులాలకు న్యాయం చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఎస్సీ విద్యార్థుల స్కాలర్ షిప్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల పై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సంఘం నాయకులు నర్సిములు, వెంకటప్ప, తిమ్మప్ప, సింగారం శీను, బాలు, అడిగప్ప, నరేష్, పెద్ద పెంటప్ప , హన్మంతు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.