abhishek, vaibhav| ఇవాళ విధ్వంసం సృష్టించేదెవరో?

abhishek, vaibhav| ఇవాళ విధ్వంసం సృష్టించేదెవరో?
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశకు చేరుకుంది. మే 27న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్లు తలపడనున్నాయి. న్యూ చండీగఢ్‌లో జరగనున్న ఈ డూ ఆర్ డై పోరులో అందరి దృష్టి రెండు యువ విధ్వంసక ఓపెనర్లపై నిలిచింది. ఒకరు హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) కాగా, మరొకరు రాజస్థాన్ సంచలనం వైభవ్ సూర్యవంశి (Vaibhav Sooryavanshi). ఈ ఇద్దరూ ఈ సీజన్‌లో బౌలర్లపై దండయాత్ర చేస్తూ తమ జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. పవర్‌ప్లేలోనే మ్యాచ్ దిశ మార్చే సామర్థ్యం కలిగిన వీరి మధ్య పోటీ ఇప్పుడు అభిమానుల్లో భారీ ఆసక్తి రేపుతోంది.

అభిషేక్ శర్మ సూపర్ ఫామ్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్‌గా దిగుతున్న అభిషేక్ శర్మ ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్‌లలో 481 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్ల జాబితాలో నిలిచాడు. అతని స్ట్రైక్‌రేట్ 209గా ఉండటం అతని దూకుడు ఆటకు నిదర్శనం. ఈ సీజన్‌లో ఇప్పటికే ఒక సెంచరీ నమోదు చేసిన అభిషేక్ 37 సిక్సర్లు బాదాడు. ప్రత్యేకంగా పవర్‌ప్లే ఓవర్లలో అభిషేక్ దూకుడు హైదరాబాద్‌కు భారీ ఆరంభాలు అందించింది. ఇటీవల రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అతడు 29 బంతుల్లో 57 పరుగులు చేసి జట్టుకు వేగవంతమైన స్టార్ట్ ఇచ్చాడు.

సూర్యవంశీ సంచలనం
మరోవైపు రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో నిజమైన విధ్వంసకుడిగా అవతరించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతడు ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ 14 మ్యాచ్‌లలో 583 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్‌రేట్ 232కు పైగా ఉండటం విశేషం. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా కూడా నిలిచాడు. సూర్యవంశీ ఇప్పటికే ఒక అద్భుత సెంచరీతో పాటు పలు వేగవంతమైన హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. హైదరాబాద్‌పై జరిగిన మ్యాచ్‌లో కేవలం 37 బంతుల్లో 103 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే ఓపెనర్లు
ఈ ఎలిమినేటర్‌లో ఇరు జట్ల బౌలర్ల కంటే ఓపెనర్ల ప్రభావమే ఎక్కువగా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అభిషేక్ శర్మ – ట్రావిస్ హెడ్ జోడీ ఒకవైపు, సూర్యవంశీ – యశస్వి జైస్వాల్ జోడీ మరోవైపు పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను తారుమారు చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) కూడా సూర్యవంశీని ఆపేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపాడు. అతడి వికెట్ మ్యాచ్‌లో కీలకమని అభిప్రాయపడ్డాడు. ఇలా చూస్తే మే 27 ఎలిమినేటర్‌లో అభిమానులకు భారీ సిక్సర్లు, పవర్‌హిట్టింగ్, ఉత్కంఠభరిత పోరు ఖాయం అన్న అంచనాలు నెలకొన్నాయి.
