rain ముందు మురిపించింది…

ఇప్పుడు ముఖం చాటేసిన వరుణుడు

మూడు వారాలుగా కనిపించని వర్షాలు

కీలక దశలో వాడిపోతున్న పంటలు

బోర్లపై ఆధారపడుతున్న అన్నదాతలు

టేకుమట్ల, ఆంధ్రప్రభ : “వరుణదేవా… కరుణించు! సమృద్ధిగా వర్షాలు కురిపించి ఆదుకో…” అంటూ ప్రజలు కప్పలకు జలాభిషేకాలు చేస్తూ, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ వరుణుడు కరుణ చూపడం లేదు.

ఈసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేయడంతో రైతులు అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారు. పొలాలను దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేశారు. కానీ ఇప్పుడు వర్షాలు ముఖం చాటేయడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

జూన్, జూలై నెలల్లో తొలుత కురిసిన వర్షాలు రైతుల్లో ఆశలు నింపాయి. అయితే ఆ తర్వాత వరుణుడు కనుమరుగవడంతో లోటు వర్షపాతం నమోదై పంటలపై తీవ్ర ప్రభావం పడుతోంది.

వానాకాలం ప్రారంభంలో వర్షాల కోసం ఎదురుచూసిన రైతులు, జూలైలో ఒకే రోజు కురిసిన భారీ వర్షంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ వర్షాలు ఆగిపోవడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. రోజులు గడుస్తున్నా సరైన వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే వేసిన పంటలు ఎదుగుదల లేక వాడిపోతున్నాయి.

గత రెండేళ్లుగా కరువుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు ఈ ఏడాది ఎన్నో ఆశలతో సాగుకు సిద్ధమయ్యారు. తొలకరి జల్లులతో ఉత్సాహంగా విత్తనాలు చల్లినా, ఇప్పుడు వర్షాలు లేక ఆశలు ఆవిరవుతున్నాయి.

గ్రామాల్లో ఈసారి పత్తి కంటే మొక్కజొన్న సాగుకు రైతులు ఎక్కువ ఆసక్తి చూపారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేశారు. దుక్కులు దున్ని విత్తనాలు చల్లుకున్నారు. అయితే వర్షాలు లేక విత్తనాలు సరిగా మొలకెత్తకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు

వర్షాలు కురవాలని రైతులు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చిన్నారులు సంప్రదాయం ప్రకారం కప్పకావడి ఆడుతూ వరుణదేవుడి కరుణ కోసం ప్రార్థిస్తున్నారు. కానీ వర్షాలకు బదులుగా ఎండలు దంచికొడుతుండటంతో రైతుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది.

బోర్లపై ఆధారపడుతున్న రైతులు

సరైన వర్షాలు లేకపోవడంతో కొంతమంది రైతులు బోర్ల ద్వారా పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భూగర్భ జలాలు కూడా తగ్గిపోవడంతో అది కూడా భారంగా మారుతోంది. విద్యుత్ ఖర్చులు, డీజిల్ వ్యయం పెరగడంతో సాగు వ్యయం మరింత అధికమవుతోంది.

రైతు ఆవేదన

“వర్షాలు లేక పత్తి చేలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే పంటలకు మందులు పిచికారీ చేశాం. కానీ వర్షాలు లేక మొక్కలు పెరగకపోగా వాడిపోతున్నాయి. పంటల కోసం భారీగా పెట్టుబడి పెట్టాం. ఇకపై కూడా వర్షాలు కురవకపోతే దిగుబడి తగ్గిపోతుంది. పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు,” అని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.