బందరులో మొదలైన కొత్త ఉద్యమం..!

బందరులో మొదలైన కొత్త ఉద్యమం..!
మచిలీపట్నం, ఆంధ్రప్రభ మచిలీపట్నం నగరాన్ని పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర భూగర్భ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి Kollu Ravindra పిలుపునిచ్చారు.
సోమవారం మచిలీపట్నం నగర పరిధిలోని కోనేరుసెంటర్‌లో నిర్వహించిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ DK Balajiతో కలిసి మంత్రి చీపిరి పట్టుకుని రోడ్లపై ఉన్న చెత్తను తొలగించారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రోడ్లపై ఆవులు సంచరించడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుని అమాయకుల ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సమస్యలపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకునే సమయంలో కొంతమంది కోర్టుల్లో కేసులు వేస్తున్నారని అన్నారు.
ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యముకాదని, ప్రమాదాలకు కారణమయ్యే అంశాలపై అధికారులు తీసుకునే చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.
అలాగే బందరు పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. స్వచ్ఛమైన నగర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బండి రామకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కంచె నాని, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా, టీడీపీ అధ్యక్షుడు లోగిశెట్టి వెంటకస్వామి, కమిషనర్ బాపిరాజు, పీవీ ఫణి కుమార్, రాజా, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
