ఆరోపణల వెనుక అసలు కథ ఏంటి..?

ఆరోపణల వెనుక అసలు కథ ఏంటి..?

విజయవాడ, ఆంధ్రప్రభ ఏపీ లిక్కర్స్ స్కాం వ్యవహారంలో తన కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలను విజయవాడ ఎంపీ Kesineni Chinni తీవ్రంగా ఖండించారు. ఒక గృహిణిపై ఈ తరహా ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు. తమ కుటుంబానికి వ్యక్తిగతంగా ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రభతో సోమవారం ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, గతంలో Raj Kasireddyతో కలిసి ఏర్పాటు చేసిన ఒక కంపెనీకి మాత్రమే నోటీసులు వచ్చినట్లు తెలిపారు. ఆ కంపెనీలో తన భార్య ప్రతినిధిగా ఉండటంతో ఆమె పేరు నోటీసుల్లో ప్రస్తావనకు వచ్చి ఉండొచ్చని చెప్పారు.

2021లో రాజ్ కసిరెడ్డితో కలిసి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేపట్టాలని భావించినట్లు వెల్లడించారు. ఆ సంస్థ ద్వారా సుమారు రూ.30 లక్షల వరకు మాత్రమే లావాదేవీలు జరిగాయని తెలిపారు. పరిస్థితులను అర్థం చేసుకుని 2022లోనే ఆ కార్యక్రమం నుంచి పూర్తిగా వైదొలిగామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ స్థలాలు ఖాళీగానే ఉన్నాయని చెప్పారు.

ఈ వ్యవహారంలో అనవసరంగా తనను టార్గెట్ చేస్తున్నారని కేశినేని చిన్ని ఆరోపించారు. ఈ నెల 27న కంపెనీ ప్రతినిధులు విచారణ అధికారుల ఎదుట హాజరై పూర్తి వివరణ ఇస్తారని వెల్లడించారు.

“ప్రైడ్ ఇన్ఫ్రాలో ఎవరూ డైరెక్టర్లు లేరు. కేశినేని డెవలపర్స్‌లో మాత్రమే జానకి లక్ష్మి డైరెక్టర్‌గా ఉన్నారు” అని స్పష్టం చేశారు.

తాము ప్రజా జీవితంలోకి వచ్చినది ప్రజలకు సేవ చేయడానికేనని పేర్కొన్నారు. తాను కరుడుగట్టిన Telugu Desam Party కార్యకర్తనని తెలిపారు. ఎలాంటి తప్పులు చేసినట్లు నిరూపితమైతే ఏ శిక్షనైనా అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

తనపై, తన కుటుంబంపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని మీడియా, రాజకీయ వర్గాలను కేశినేని చిన్ని కోరారు.