మున్సిపల్ సమావేశానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు డుమ్మా
గైర్హాజరుపై రాజకీయ వర్గాల్లో చర్చ.. కారణాలపై స్పష్టత కరువు
ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమావేశానికి దూరమైన ప్రజాప్రతినిధులు
గుమ్మడిదల, ఆంధ్రప్రభ: గుమ్మడిదల మున్సిపాలిటీ జనరల్ సమావేశం శుక్రవారం నిర్వహించగా, పలువురు బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు గైర్హాజరు కావడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీ పరిధిలో తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ తదితర ప్రజా సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన కీలక సమావేశానికి ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సమావేశానికి హాజరుకాకుండా కొందరు కౌన్సిలర్లు తీర్థయాత్రలకు వెళ్లినట్లు సమాచారం. ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయంలో వ్యక్తిగత కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం సరైన విధానం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే కౌన్సిలర్లు సమావేశానికి దూరంగా ఉండటానికి ఛైర్మన్‌పై అసంతృప్తి కారణమా, అంతర్గత విభేదాలా, లేక వ్యక్తిగత కారణాలా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయంపై అధికార పార్టీ నాయకత్వం గానీ, గైర్హాజరైన కౌన్సిలర్లు గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
