విశాఖ రైల్వే జోన్ గెజిట్‌పై బీజేపీ నేత హర్షం

విశాఖ రైల్వే జోన్ గెజిట్‌పై బీజేపీ నేత హర్షం
శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ (SCoR) ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి స్వాగతించారు. ఏపీ ప్రజల దశాబ్దాల కల నెరవేరిన శుభ సందర్భమిదని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో 2026 జూన్ 1 నుంచి జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కేంద్రం గడువు నిర్ణయించడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి మైలురాయి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు రైల్వే డివిజన్లను ఈ జోన్‌లో చేర్చడం ద్వారా రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలు విప్లవాత్మకంగా మారనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనడానికి ఈ నిర్ణయం నిదర్శనమని తెలిపారు. విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పడటం వల్ల ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు కొత్త రైళ్లు, మెరుగైన రవాణా సదుపాయాలు అందనున్నాయని అన్నారు.
మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు..
రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. జోన్ ఏర్పాటుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి, పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన స్పష్టం చేశారు.
