వైసీపీ పాలన అరాచకానికి కేరాఫ్ అడ్రస్..
డీఎస్సీపై చర్చకు లోకేష్ సిద్ధం..
చర్చకు ముందుకు రాని వైసిపి..
( భవానిపురం, ఆంధ్రప్రభ ) : వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని, సంక్షేమానికి చంద్రబాబే చిరునామా అని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్దా వెంకన్న విమర్శించారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బుద్దా వెంకన్న మాట్లాడుతూ, అరాచక పాలనకు పేటెంట్ హక్కులు జగన్‌మోహన్‌రెడ్డికే ఉన్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యే విరూపాక్షి దళితుడైన గురునాథ్‌పై దాడి చేసిన ఘటనలో చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అలాంటి ఘటనలను సమర్థించడం తగదని వ్యాఖ్యానించారు. సంక్షేమం అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే సంక్షేమమని పేర్కొన్న ఆయన, అరాచకం అంటే జగన్‌మోహన్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి అంటే అరాచకమని విమర్శించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపించారు. డీఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్ చర్చకు సిద్ధమని ప్రకటించినప్పటికీ, వైసీపీ నేతలు చర్చకు ముందుకు రావడం లేదన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురు చూశారని, ఆ పని ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించి తప్పుడు కేసులు పెట్టింది వైసీపీ ప్రభుత్వమేనని ఆరోపించిన బుద్దా వెంకన్న, ప్రజా అంశాలపై మాట్లాడేటప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడాలని జగన్‌మోహన్‌రెడ్డికి సూచించారు.
