పాత బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులు నిలిపివేయాలని వినతి

ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్‌కు గ్రామస్తుల విజ్ఞప్తి

నిజాంపేట, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ బస్సులు నిలిపివేయాలని కోరుతూ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నగేష్‌కు నిజాంపేట గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలో కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ రెండూ ఉన్నప్పటికీ ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులు పాత బస్టాండ్ వద్ద ఆగడం లేదని తెలిపారు. దీంతో గ్రామస్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

పాత బస్టాండ్ సమీపంలో కొత్త బస్టాండ్ నిర్మాణానికి సంబంధించి స్థల పరిశీలన పూర్తై హద్దులు నిర్ణయించినప్పటికీ, ఆ ప్రాంతంలో బస్సులు నిలిపివేయడం లేదని అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై స్పందించిన అడిషనల్ కలెక్టర్ నగేష్.. సంబంధిత ఆర్టీసీ అధికారులతో మాట్లాడి పాత బస్టాండ్ వద్ద తక్షణమే బస్సులు ఆపేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు రంజిత్ గౌడ్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ అజీజ్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, చంద్రకాంత్ గౌడ్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.