తిరుపతి కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి

  • ఆటా మహాసభల్లో కుప్పాల గిరిధర్ కుమార్

తిరుపతి సిటీ, ఆంధ్రప్రభ : తిరుపతి సమగ్ర అభివృద్ధి, రాయలసీమలోని పురాతన దేవాలయాల పునరుద్ధరణతో పాటు తిరుపతి కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు అవసరాన్ని అమెరికా తెలుగు సంఘం (ATA) 19వ మహాసభల్లో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ ప్రస్తావించారు.

ఆదివారం (ఆగస్టు 2) అమెరికాలోని వాషింగ్టన్ డీసీ సమీపంలోని బాల్టిమోర్‌లో నిర్వహించిన “మన రాయలసీమ” అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. రాయలసీమ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, ప్రాంతీయ వెనుకబాటుతనం, అభివృద్ధి అవకాశాలు, ప్రభుత్వ విధానాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి కీలక అంశాలపై ఆటా వేదికగా సమగ్ర చర్చ జరగడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కుప్పాల గిరిధర్ కుమార్ మాట్లాడుతూ, తిరుపతి అభివృద్ధిని కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా, ప్రాంతీయ అభివృద్ధికి ఇంధనంగా మలచాల్సిన అవసరం ఉందన్నారు. టీటీడీ నిధులతో ముందుగా తిరుపతిలోని చిన్న, అనుబంధ, చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు, అనంతరం రాయలసీమలోని పురాతన దేవాలయాల పునరుద్ధరణ చేపట్టాలని సూచించారు.

టీటీడీ నిధుల వినియోగంలో ప్రాధాన్యత అవసరం

తిరుమల తిరుపతి దేవస్థానం దేశ, విదేశాల్లో హిందూ ధర్మ ప్రచారం కోసం ఆలయాల నిర్మాణం చేపట్టడం అభినందనీయమేనని, అయితే టీటీడీ నిధుల వినియోగంలో ప్రాధాన్యతా క్రమం పాటించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముందుగా తిరుపతిలోని చిన్న, అనుబంధ ఆలయాలను అభివృద్ధి చేసి, అనంతరం రాయలసీమలో నిర్లక్ష్యానికి గురైన చారిత్రక దేవాలయాల పునర్నిర్మాణం చేపట్టాలని సూచించారు. దీనివల్ల ఆధ్యాత్మిక పర్యాటకంతో పాటు స్థానిక ఉపాధి, ఆర్థికాభివృద్ధి కూడా పెరుగుతుందని చెప్పారు.

రాయలసీమకు రైల్వే న్యాయం జరగాలి..

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే పరిపాలనలో తీవ్ర అసమానత కొనసాగుతోందని గిరిధర్ కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఒంగోలు, నెల్లూరు, ఉమ్మడి రాయలసీమ నాలుగు జిల్లాలు కలిపి మొత్తం ఆరు జిల్లాలకు గుంతకల్లు ఒక్కటే రైల్వే డివిజన్ సేవలు అందిస్తోందని తెలిపారు. మరోవైపు మిగిలిన ఏడు జిల్లాలకు విజయవాడ, గుంటూరు రైల్వే డివిజన్లతో పాటు విశాఖపట్నం డివిజన్, జోన్ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ఈ అసమానతను తొలగించేందుకు తిరుపతి కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని, అలాగే రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణ, కొత్త రైల్వే మార్గాల అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి ఆధ్యాత్మిక, పర్యాటక, ఆర్థిక ప్రాధాన్యత దృష్ట్యా ఈ నిర్ణయం ప్రాంతీయ అభివృద్ధికి కీలకమని అన్నారు.

రాయలసీమ అభివృద్ధి అనేది కేవలం ఒక ప్రాంత ఆకాంక్ష మాత్రమే కాదని, సమతుల్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అవసరమైన అంశమని పేర్కొన్నారు. ఇటువంటి చర్చలు విధానపరమైన మార్పులకు దారి తీసి ప్రాంతీయ సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాయలసీమ అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒకే వేదికపై చర్చించే అవకాశం కల్పించిన ఆటా నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రసాద్ చరసాల, రాజశేఖర్ కల్కి, లక్ష్మీరెడ్డి, జయదేవ్ మొట్టుపల్లి, రామనరెడ్డి, జయదేవ్ రెంటాల తదితర ప్రముఖ వక్తలు తమ విశ్లేషణాత్మక ప్రసంగాలతో సదస్సును మరింత సార్థకంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు.