దుర్గగుడిలో ఆభరణాల ఆడిట్‌ ప్రారంభం

దుర్గగుడిలో ఆభరణాల ఆడిట్‌ ప్రారంభం

-గోల్డ్ అప్రైజర్ సస్పెన్షన్ తర్వాత కట్టుదిట్టమైన తనిఖీలు
-హుండీ లెక్కింపులో గోల్డ్ చేతివాటం ఆరోపణలతో చర్యలు
-ట్రస్ట్ బోర్డు విన్నపంతో కమిషనర్ ఆదేశాలు
-రెండు రోజులపాటు బంగారం, వెండి ఆభరణాల సమగ్ర ఆడిట్
-స్ట్రాంగ్ రూమ్ నుంచి ఆలయ వినియోగ ఆభరణాల వరకు తనిఖీలు

ఎన్టీఆర్ బ్యూరో,ఆంధ్రప్రభ: విజయవాడలోని శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో అమ్మవారి ఆభరణాలపై విస్తృత స్థాయి ఆడిట్ ప్రారంభమైంది. హుండీ లెక్కింపు సందర్భంగా గోల్డ్ అప్రైజర్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ బోర్డు విన్నపంతో కమిషనర్ ఆదేశాల మేరకు బంగారం, వెండి ఆభరణాలపై కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టారు. ఇటీవల హుండీ లెక్కింపు ప్రక్రియలో గోల్డ్ చేతివాటం జరిగిందన్న ఆరోపణలు రావడం ఈ నేపథ్యంలో బాధ్యుడిగా గుర్తించిన గోల్డ్ అప్రైజర్‌పై అధికారులు సస్పెన్షన్ వేటు విధించారు. ఈ పరిణామాల తర్వాత ట్రస్ట్ బోర్డు సభ్యులు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ను కలిసి స్వయంగా వినతిపత్రం సమర్పించారు. ఆభరణాల పూర్తి లెక్కలు తేల్చాలని కోరడంతో, ఈనెల 23, 24 తేదీల్లో సమగ్ర ఆడిట్ నిర్వహించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. రీజనల్ గోల్డ్ అప్రైజర్ ఆధ్వర్యంలో, ట్రస్ట్ బోర్డు సభ్యుల సమక్షంలో తనిఖీలు ప్రారంభమయ్యాయి.

మొదటి రోజు బంగారు ఆభరణాల లెక్కింపుపై దృష్టి సారించిన అధికారులు, భక్తులు సమర్పించిన బంగారు ఆభరణాల రికార్డులను 9 గంటలకు పైగా నిశితంగా పరిశీలించారు. తదుపరి దశలో స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచిన ఆభరణాలను రికార్డులతో సరిపోల్చి తనిఖీ చేశారు. అనంతరం ప్రధానాలయం వద్ద నిత్య వినియోగంలో ఉన్న అమ్మవారి బంగారు ఆభరణాలను కూడా విడివిడిగా లెక్కించి నమోదు చేశారు. అన్ని అంశాలను రికార్డులతో పోల్చి ఖచ్చితత్వాన్ని నిర్ధారించే ప్రయత్నం చేశారు.

ఈ ఆడిట్ ప్రక్రియ రెండో రోజు కూడా కొనసాగనుండగా, శుక్రవారం వెండి ఆభరణాల లెక్కింపుపై అధికారులు దృష్టి సారించనున్నారు. ఈ తనిఖీల్లో జాయింట్ స్థాయి చీఫ్ అప్రైజర్ పల్లం రాజు, కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన అధికారులు, దేవస్థానం ఏఈవోలు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా పాల్గొన్నారు.సస్పెండ్ అయిన గోల్డ్ అప్రైజర్ షమీకి కూడా పూర్తి వివరాలతో హాజరు కావడం కట్టుదిట్టంగా లెక్కింపు చేస్తూ ఈ ఆడిట్ అనంతరం ఆభరణాల నిర్వహణలో లోపాలు ఉన్నాయా లేదా అన్నది తేలే అవకాశం ఉంది.

Leave a Reply