KNR | చనిపోయిన వారి పేర్లతో రుణాలు.. రూ.1.39 కోట్లు స్వాహా

మంచిర్యాల టౌన్, (ఆంధ్రప్రభ) : జిల్లా కేంద్రంలో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ఓ ఫైనాన్స్ కంపెనీ బ్రాంచ్ మేనేజర్ చనిపోయిన వ్యక్తుల పేర్లపై రుణాలు తీసుకుని రూ.1.39 కోట్లు కాజేశాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం…

మరణించిన వ్యక్తుల పేర్లపై రూ.1.39 కోట్ల రుణాలు మంజూరు చేసి, చోళ మండల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్, హౌసింగ్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ చల్లా ప్రవీణ్ రెడ్డి… ఆ డబ్బును తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నాడని ఏసీపీ ఆర్.ప్రకాష్ తెలిపారు.

నిందితుడు ప్రవీణ్ రెడ్డితో పాటు కరీంనగర్ ఏరియాలో ఏసీఎంగా పనిచేసే చిట్టేటి అశోక్ రెడ్డిలు పతకం ప్రకారం… కత్తెరశాల, కిష్టంపేట గ్రామానికి చెందిన, చనిపోయిన చేతేల్లి సమ్మయ్య పేరు మీద రూ.25,90,000, చల్ల రామయ్య పేరు మీద రూ.20,00,000, చేతేల్లి చిన్న బక్కయ్య పేరు మీద రూ.20,00,000, దోమల సారమ్మ పేరు మీద రూ.24,00,000, చల్ల రవీందర్ పేరు మీద రూ.25,00,000, బొజ్జ మల్లయ్య పేరు మీద రూ.25,00,000, మొత్తం రూ.1,39,90,000 లోన్లు మంజూరు చేయించారు. ఆ డబ్బులను బ్యాంకు నుండి డ్రా చేసి తమ సొంతానికి వాడుకున్నారని తెలిపారు.

అయితే, నెలవారీ బకాయిల చెల్లింపులు జరగకపోవడంతో విషయం బయటకు వచ్చిందని, ఈ విషయం తెలుసుకున్న సదరు సంస్థ నిర్వాహకులు ఫిర్యాదు చేయగా దర్యాప్తు నిర్వహించి ప్రవీణ్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరికి సహకరించిన మిగతా వారిని కూడా విచారణ అనంతరం అరెస్ట్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ ప్రమోద్ రావు, ఎస్సై కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *