విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు పోవాలి…

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు పోవాలి…
కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి…
బిక్కనూర్, ఆంధ్రప్రభ : విశ్వ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు తమ భవిష్యత్ ను గొప్పగా నిర్మించుకొనేలా ఆలోచించాలని కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. సౌత్ క్యాంపస్ లో విద్యార్థులకు జరిగిన కౌన్సిలింగ్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్వవిద్యాలయం విద్యార్థులకు తమను తాము ఉత్తమ వ్యక్తులుగా మలుచుకునే అవకాశం ఇస్తుందని అన్నారు. మంచి స్నేహాలను, నైపుణ్యాలను తీపి గుర్తులను ఇక్కడ పెంచుకోవాలని ఆమె అన్నారు.
అంతేకానీ అనవసర విషయాలలో తలదూర్చి జీవితాలను పాడు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. తాము చదువుకున్న విద్యాలయం తమకు గొప్ప జ్ఞాపకాలను ఇవ్వాలని అన్నారు. చిన్న చిన్న విషయాలకు ఆవేశాలకు పోతే జీవితం చిన్నాభిన్నం అవుతుందని హితవు పలికారు. కాలేజ్ స్నేహం జీవితాంతం ఉంటుందని అలాంటి స్నేహాలను పెంచుకోవాలని అన్నారు. సీనియర్ విద్యార్థులు జూనియర్ లకు ఒక గైడ్ లా ఉండాలి అన్నారు.జూనియర్ విద్యార్థులు సీనియర్ ల నుండి సలహాలు తీసుకొని కలిసి మెలిసి ఉండాలని తెలిపారు.
ముందుగా ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ క్యాంపస్ విశేషాలను వివరిస్తూ మాట్లాడారు. తమ విద్యార్థులు ఇప్పటివరకు సాధించిన విజయాలు, క్యాంపస్ లో జరిగిన అభివృద్ధికరమైన విషయాలను వివరించారు. ర్యాగింగ్ జరగకుండా తాము తీసుకుంటున్న చర్యలను తెలిపారు. భిక్నూర్ సి. ఐ సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరికీ విద్యార్థి జీవితం చాలా అందమైన దని అన్నారు. ఎన్నో ఆశలతో, ఆశయాలతో తల్లి దండ్రులు తమ జీవితాలను త్యాగం చేస్తూ విద్యార్థులను చదివిస్తున్నారని అన్నారు.అలాంటి జీవితాన్ని పనికిరాని విషయాలకు ఇబ్బందుల్లో పడేసుకోవద్దని హెచ్చరించారు.తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టేలా మన నడవడిక ఉండాలని తెలిపారు.
భిక్నూర్ ఎస్. ఐ ఆంజనేయులు మాట్లాడుతూ ర్యాగింగ్ వల్ల జరిగే పరిణామాలు, శిక్షలు, చట్టాలను గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. విద్యార్థి జీవితంలో పోలీస్ కేసు ల వైపు పోతే ఉద్యోగావకాశాల్లో వచ్చే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బాయ్స్ హాస్టల్ వార్డెన్ డా.యాలాద్రి, ఏపీఆర్ఓ డా. సరిత పిట్ల అధ్యాపకులు డా.సబిత, డా.నారాయణ, డా.నర్సయ్య, డా.రమాదేవి, శ్రీకాంత్ ,డా.శ్రీమాత ,డా. వెంకట్ రెడ్డి, డా.విజయ్ కుమార్ సీనియర్, జూనియర్ విద్యార్థులు పాల్గొన్నారు.
