లారీ అసోసియేషన్ సంఘాల మధ్య ఘర్షణ
జైపూర్,ఆంధ్రప్రభ : జైపూర్ మండలంలో నస్పూర్, జైపూర్ లారీ అసోసియేషన్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు డ్రైవర్ లు గాయాలయ్యారు. వివరాల్లోకి వెళ్లితే మండలంలో కుందారం గ్రామా అటవీ ప్రాంతం నుండి గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ పేపర్ తయారీ కర్మాగారాన్ని నీలగిరి కర్రను పంపించడం జరుగుతుంది. కాగా కాగజ్ నగర్ కు చెందిన కాంట్రాక్టర్లు నస్పూర్ కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫర్ అసోసియేషన్ తో పాటు జైపూర్ కు చెందిన మరో లారీ ఓనర్స్ అసోసియేషన్ అగ్రిమెంట్ చేసినట్లు సమాచారం.
గురువారం రెండు అసోసియేషన్ లకు చెందిన లారీలు నీలగిరి కర్రను గుజరాత్ రాష్ట్రానికి తరలించే క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.సమాచారం అందుకున్న జైపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నస్పూర్ కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫర్ అసోసియేషన్ చెందిన సాయి చరణ్, నసీరుద్దీన్ అనే డ్రైవర్ లకు గాయాలు కాగా వారిని మంచిర్యాల ఓ ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఆ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
తమ అసోసియేషన్ చెందిన డ్రైవర్లను జైపూర్ అసోసియేషన్ సభ్యులు గాయపరచడం జరిగిందని జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నస్పూర్ అసోసియేషన్ అధ్యక్షుడు జోగుల సదానందం,జాయింట్ సెక్రటరీ అరికేల రమేష్ లు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జోగుల సదానందం మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా నస్పూర్, శ్రీరాంపూర్, జైపూర్,బీమారం ఏరియాలకు చెందిన ధాన్యం మొదలైన వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు.జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన ఓ నాయకులు మంచిర్యాల అసోసియేషన్ నుండి విడిపోయి ఇటీవల జైపూర్ మండలంలో ఓ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు.
స్థానిక ఎమ్మెల్యే,మంత్రి అండదండలతోనే ఆ వ్యక్తి తమపై దాడికి పాల్పడ్డారని నస్పూర్ కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫర్ అసోసియేషన్ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు.ఈ విషయంపై జైపూర్ ఎస్సై భూమేష్ ని వివరణ కోరగా గురువారం కుందారం గ్రామా అటవీ ప్రాంతం నుండి గుజరాత్ రాష్ట్రానికి నీలగిరి కర్రను లారీలల్లో తరలించే క్రమంలో నస్పూర్, జైపూర్ లారీ ఓనర్స్ వెల్ఫర్ అసోసియేషన్ సభ్యుల మధ్య ఘర్షణ జరిగిందని దీనిలో ఇరువర్గాలకు చెందిన డ్రైవర్లు గాయాలపాలయ్యారు.ఈ మేరకు నస్పూర్, జైపూర్ లారీ ఓనర్స్ వెల్ఫర్ అసోసియేషన్ సభ్యుల మీద కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై భూమేష్ పేర్కొన్నారు.
