వరుస దాడులతో చిరుత పంజా

- బోడగుట్టగా నివాసం
- ఫారెస్ట్ అధికారులపై మండిపడుతున్న గ్రామ ప్రజలు
- నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న అటవీ అధికారులు
తాడ్వాయి, ఆంధ్రప్రభ : బోడగుట్ట ప్రాంతంలో మరోసారి చిరుత పంజా విసిరింది. ఎర్రపాడు గ్రామ శివారులో గత వారం రోజులుగా చిరుత సంచారం చేస్తోందని, ఇప్పటికే నాలుగు పశువులపై దాడి చేసి చంపిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాంధీనగర్, మోతే, ఎల్లాపూర్, ఎర్రపహాడ్ గ్రామ శివారుల్లో గత వారం రోజులుగా చిరుత మూగజీవాల ప్రాణాలతో చెలగాటమాడుతోందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఈ పరిస్థితి గ్రామాల్లో తీవ్ర భయాందోళనలకు దారి తీస్తోంది.
అటవీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15న ఎర్రపాడు గ్రామానికి చెందిన సంగయ్య చేనులో కట్టేసి ఉన్న దూడను చిరుత చంపినట్టు గ్రామస్తులు తెలిపారు. అదే విధంగా తెల్లవారుజామున మోతే గ్రామానికి చెందిన మల్లేష్ అనే రైతు వ్యవసాయ చేనువద్ద ఉన్న లేగ దూడను కూడా చిరుత పొట్టన పెట్టుకుంది. శనివారం మల్లయ్యకు చెందిన గొర్రెను వెంటాడి చంపిన సంఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఈ వరుస ఘటనలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాగే నిర్లక్ష్యం కొనసాగితే మనుషుల ప్రాణాలకు కూడా ముప్పు తప్పదని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
