మూడేళ్లకోసారి సెప్టిక్ ట్యాంకులు తప్పనిసరిగా శుభ్రం చేయాలి
మలిన వ్యర్థాలను ఎఫ్‌ఎస్‌టీపీకే తరలించాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న
ఉమ్మడి వరంగల్ బ్యూరో, ఆంధ్రప్రభ: అభ్యుదయ సేవా సమితి, స్వచ్ఛ వరంగల్ పౌర సంఘాల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో గృహాలు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాల్లో సెప్టిక్ ట్యాంకుల క్రమబద్ధమైన డిస్లడ్జింగ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న శుక్రవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం సెప్టిక్ ట్యాంకుల నిర్వహణపై ప్రత్యేక చట్టాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రతి గృహం, అపార్ట్‌మెంట్, వాణిజ్య భవనంలోని సెప్టిక్ ట్యాంకును మూడేళ్లకోసారి తప్పనిసరిగా శుభ్రపరచాలని సూచించారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సెప్టిక్ ట్యాంకులను క్రమం తప్పకుండా డిస్లడ్జింగ్ చేయించుకోవాలని పిలుపునిచ్చారు.
సెప్టిక్ ట్యాంకుల డిస్లడ్జింగ్ వాహనాల యజమానులు సేకరించిన మలిన వ్యర్థాలను రోడ్ల పక్కన, కాలువల్లో లేదా ఇతర ప్రాంతాల్లో పారబోయకుండా, తప్పనిసరిగా అమ్మవారిపేటలోని ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్‌ఎస్‌టీపీ)కు తరలించి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని సూచించారు. దీంతో ప్రజారోగ్య పరిరక్షణతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు.
అభ్యుదయ సేవా సమితి అధ్యక్షుడు మండల పరశురాములు మాట్లాడుతూ, సెప్టిక్ ట్యాంకుల క్రమబద్ధమైన డిస్లడ్జింగ్‌పై కమ్యూనిటీ స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరిశుభ్రమైన వరంగల్ నిర్మాణానికి ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో స్వచ్ఛ వరంగల్ పౌర సంఘాల వేదిక ప్రతినిధులు, ఎఎస్‌సీఐ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రాజ్‌మోహన్ రెడ్డి, సెప్టిక్ ట్యాంక్ వాహన యజమానులు తదితరులు పాల్గొన్నారు.
