సివిల్స్ కోచింగ్ వదిలి… పంచాయతీ బరిలోకి..!

- నార్నూర్ సర్పంచ్ పదవికి బానోత్ కావేరి పోటీ
- ప్రజాసేవ చేయడమే ఏకైక లక్ష్యం
ఆంధ్రప్రభ, నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మేజర్ పంచాయతీకి విద్యావంతురాలు బానోత్ కావేరి ప్రజాసేవనే లక్ష్యంగా సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. తొలి విడతగా ఈ నెల 11న జరుగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, గ్రామ అభివృద్ధికి చేపట్టాల్సిన లక్ష్యాలను ఇంటింటికీ తిరుగుతూ వివరించారు.
తాము ఐఏఎస్ కావాలన్న ఆశయంతో నాగ్‌పూర్‌లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటుండగా, సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు కేటాయించడంతో తండ్రి గజానంద్ బాటలో ప్రజాసేవ చేయాలన్న తపనతో ఈ పోటీలో పాల్గొంటున్నట్టు చెప్పారు. ఈ కారణంగా సివిల్స్ కోచింగ్ మధ్యలోనే ఆపినట్టు తెలిపారు.
గ్రామ అభివృద్ధి కోసం తన తండ్రి బానోత్ గజానంద్ వరుసగా మూడు సార్లు సర్పంచ్‌గా విజయం సాధించి ఎంతో కృషి చేశారని, ఆ ప్రజాసేవా దృక్పథంతో తాను కూడా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్తే ప్రతి ఒక్కరూ ప్రేమతో ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్నారని చెప్పారు.
తాను గెలిచిన వెంటనే నార్నూర్ గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి తన సత్తా చూపిస్తానని కావేరి సగర్వంగా తెలిపారు. బ్యాట్ గుర్తుతో గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.
