KTR | ఆర్థిక చక్రం అపసవ్య దిశలో వెళ్తోంది…
KTR | ఆర్థిక చక్రం అపసవ్య దిశలో వెళ్తోంది…
KTR | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ధనిక రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతుల్లో పెడితే… ఆర్థిక చక్రం అపసవ్య దిశలో వెళ్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి.. ఎందుకు చెప్పాలని ప్రశ్నించారు. రైతులు, వితంతువులు, వృద్ధులు, నిరుద్యోగులు ఎవరు ధన్యవాదాలు చెప్పాలని నిలదీశారు. గ్యారంటీ కార్డులను భద్రపరచుకోవాలని చెప్పి మోసం చేయలేదా అని మండిపడ్డారు.
పాలకులు ప్రజలకు ఇచ్చిన మాటను నెలబెట్టుకోవాలని కేటీఆర్ తెలిపారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి విలువ ఉండాలన్నారు. గవర్నర్ ప్రసంగానికి ప్రాధాన్యత ఉంటుందని వ్యాఖ్యానించారు. కానీ గవర్నర్ ప్రసంగానికి విలువ లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం చేసిన ఫైల్ ఏమైందని అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ నిలదీశారు. కీలకమైన ఆ ఫైల్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.
మాయమైన ఫైల్ కోసం సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తుల విలువ జీరో చేసింది ఎవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు జీరో వాల్యూ ఉందని అన్నారు. వంద రోజుల్లోనే గ్యారెంటీల అమలు ఏమైందని ప్రశ్నించారు. తొలి కేబినెట్‌లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత అన్న మాట ఏమైందని అడిగారు. సీఎం తొలి సంతకం చేసిన ఫైల్‌కు జీరో వాల్యూ ఉందని విమర్శించారు.
విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి జీరో వాల్యూ అని వ్యాఖ్యానించారు. రెండున్నరేండ్లలో రెండున్నర లక్షలు అందుకున్న కుటుంబాన్ని చూపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. మహిళలకు ఇస్తామన్న రూ.2500 హామీ ఏమైందని అడిగారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అన్నారు.. ఏమైందని నిలదీశారు. గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని మండిపడ్డారు.
