May 25 Cashless Crisis : బంకుల్లో నగదు సంక్షోభం Andhra Prabha Top News
May 25 Cashless Crisis : బంకుల్లో నగదు సంక్షోభం Andhra Prabha Top News
- లారీ యజమానులు బిక్కమొహం
- హైస్పీడ్ డీజిల్ విక్రయాలపై ఆంక్షలు
- ఏపీఎల్‌ఓఏ ఆందోళన
- క్యాష్‌లెస్ తో రవాణా రంగం సతమతం
- తక్షణ జోక్యం కోరుతూ సీఎస్‌కు లారీ యజమానుల సంఘం విజ్ఞప్తి
( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో )
May 25 Cashless Crisis : రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో లారీలకు హైస్పీడ్ డీజిల్ సరఫరాలో ఎదురవుతున్న సమస్యలు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ది ఆంధ్ర ప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్కు సంఘం ప్రధాన కార్యదర్శి వై.వి. ఈశ్వరరావు లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు పెట్రోల్ బంకుల్లో లారీలకు డీజిల్ ట్రాన్సాక్షన్లు పూర్తిస్థాయిలో నిలిపివేస్తున్నారని, బ్యాంకు నిబంధనల పేరుతో నగదు లావాదేవీలను నిరాకరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. డీజిల్ సరఫరా లేకపోవడంతో లారీ రవాణా వ్యవస్థ తీవ్ర అంతరాయానికి గురవుతోందని తెలిపారు. ట్రాన్స్‌పోర్ట్ రంగం మొత్తం ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఈ పరిస్థితి మరింత సంక్షోభాన్ని సృష్టిస్తోందని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది లారీలు నిత్యం సరుకుల రవాణా నిర్వహిస్తున్నాయని, డీజిల్ సరఫరాలో అంతరాయం కలిగితే వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు అన్ని రంగాలపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఐఓసీఎల్ , హెచ్పిసిఎల్, బిపిసిఎల్, సంస్థలకు చెందిన బంకుల్లో నగదు చెల్లింపుల విషయంలో స్పష్టత లేకపోవడంతో డ్రైవర్లు, యజమానులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రవాణా రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమని, ఇలాంటి సమయంలో డీజిల్ సరఫరాపై పరిమితులు విధించడం సరైంది కాదని సంఘం అభిప్రాయపడింది. తక్షణమే సంబంధిత ఆయిల్ కంపెనీలు, బ్యాంకులతో సమన్వయం చేసి లారీలకు ఎలాంటి అంతరాయం లేకుండా హైస్పీడ్ డీజిల్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవల పెరిగిన ఇంధన వ్యయాలు, టోల్ ఛార్జీలు, నిర్వహణ ఖర్చులతో రవాణా రంగం ఇప్పటికే ఒత్తిడిని ఎదుర్కొంటోందని, ఇప్పుడు డీజిల్ లభ్యత సమస్య మరింత భారంగా మారిందని లారీ యజమానుల సంఘం పేర్కొంది. రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు సజావుగా కొనసాగాలంటే రవాణా రంగానికి తక్షణ ఉపశమనం అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
