అక్రిడేషన్ కమిటీపై సీనియర్ జర్నలిస్టుల ఆగ్రహం

అక్రిడేషన్ కమిటీపై సీనియర్ జర్నలిస్టుల ఆగ్రహం

  • అనర్హులతో కమిటీ ఏర్పాటు చేశారంటూ ప్రజావాణిలో ఫిర్యాదు
  • అవకాశం కల్పించాలని యాదగిరి గౌడ్, సమ్మయ్య వినతి

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా అక్రిడేషన్ కమిటీ ఏర్పాటు తీరుపై సీనియర్ జర్నలిస్టులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీలో అనుభవం లేని వారు, నిబంధనలకు విరుద్ధంగా ఎంపికైన వారు చోటు దక్కించుకున్నారంటూ ఆరోపిస్తూ, ప్రస్తుత కమిటీని వెంటనే రద్దు చేసి అర్హులైన సీనియర్ పాత్రికేయులకు అవకాశం కల్పించాలని ప్రజావాణి ద్వారా వేర్వేరు వినతిపత్రాలు సమర్పించారు.

50 సంవత్సరాలకు పైగా పత్రికా రంగంలో కొనసాగుతున్న తాళ్లపల్లి యాదగిరి గౌడ్ మాట్లాడుతూ.. అనేక పత్రికల్లో జర్నలిస్టుగా సేవలందించిన తనకు అక్రిడేషన్ కమిటీలో సభ్యత్వం కల్పించాలని కోరారు. గతంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన అక్రిడేషన్ కార్డులు, పాత పత్రికల కథనాల ప్రతులు సమర్పించినప్పటికీ తన దరఖాస్తును జిల్లా సమాచార శాఖ అధికారి స్వీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన సుదీర్ఘ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని కమిటీలో చోటు కల్పించాలని కలెక్టర్‌ను అభ్యర్థించారు.

మరోవైపు డాక్టర్ తాళ్లపల్లి వెంకట సమ్మయ్య కూడా కమిటీ నియామకంపై మండిపడ్డారు. కలెక్టర్, డిపిఆర్వో ఏర్పాటు చేసిన కమిటీ పారదర్శకంగా జరగలేదని, వార్తలు రాయలేని వారు, అనుభవం లేని వారు, వివాదాస్పద వ్యక్తులు కూడా సభ్యులుగా నియమించబడ్డారని ఆరోపించారు. అటువంటి కమిటీ కొనసాగితే నిజాయితీ గల జర్నలిస్టులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు.

తాను 40 సంవత్సరాల అనుభవం కలిగిన సీనియర్ జర్నలిస్టునని, ప్రభుత్వ గుర్తింపు పొందిన అవార్డు గ్రహీతనని పేర్కొంటూ ప్రస్తుత కమిటీని వెంటనే రద్దు చేసి, అర్హులతో కొత్త కమిటీని ఏర్పాటు చేసి తనకు సభ్యత్వం ఇవ్వాలని సమ్మయ్య కోరారు. తమకు న్యాయం జరగకుంటే రాష్ట్ర ఉన్నత అధికారులకు పిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. జిల్లా అక్రిడేషన్ కమిటీ వ్యవహారం ఇప్పుడు పాత్రికేయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారులు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply