గ్రామాల స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి..

గ్రామాల స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి..

అధికారులకు డీపీఓ ఆదేశాలు

పరిశుభ్రమైన గ్రామాల నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలి: జిల్లా పంచాయతీ అధికారిణి ధనలక్ష్మి

ఘంటసాల, ఆంధ్రప్రభ : గ్రామాల పరిశుభ్రతే లక్ష్యంగా పంచాయతీ కార్యదర్శులు నిరంతరం పనిచేయాలని జిల్లా పంచాయతీ అధికారిణి ధనలక్ష్మి సూచించారు. బుధవారం ఘంటసాల మండలం కొడాలి గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న స్వచ్ఛ పదం కార్యక్రమాలను ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీవో వెంకటేశ్వరరావును గ్రామంలో చేపడుతున్న స్వచ్ఛత కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ రిక్షాల ద్వారా తడి, పొడి చెత్త సేకరణ జరుగుతోందా, సేకరించిన వ్యర్థాలు సంపద సృష్టి కేంద్రానికి చేరుతున్నాయా అనే విషయాలను పరిశీలించారు.

వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో డ్రైనేజీల పూడికతీత పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. రహదారుల ఇరువైపులా చెత్తాచెదారం వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని, గ్రామ స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని తెలిపారు.

ఇంటింటికీ వెళ్లి పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని పంచాయతీ కార్యదర్శి అబ్దుల్ నయీమ్‌కు సూచించారు. అనంతరం కొడాలి గ్రామానికి సంబంధించిన సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలించి అక్కడి నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు.

స్వచ్ఛ పదం కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారం చేపడుతున్న పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి పంచాయతీ కార్యదర్శి కృషి చేయాలని ధనలక్ష్మి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.