చదువుతోనే సామాజిక ఎదుగుదల సాధ్యం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడివాడ, ఆంధ్రప్రభ: సమాజంలో పేద కుటుంబాలు ఉన్నత స్థాయికి ఎదగాలన్నా, సామాజిక మార్పు సాధించాలన్నా చదువే ప్రధాన మార్గమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ సత్యనారాయణపురంలోని ఘంటసాల ఫంక్షన్ హాల్లో జైభీమ్ ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పదో తరగతి ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
గుడివాడ పట్టణంలోని మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన 33 మంది ఎస్సీ విద్యార్థులకు నగదు పురస్కారాలను ఎమ్మెల్యే రాము అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచించారు. నైతిక విలువలతో కూడిన విద్య ద్వారానే బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దవచ్చని చెప్పారు.
చదువు బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపగలదని, ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్ ఆశయాల మేరకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని భరోసా ఇచ్చారు.
సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాకొల్లు భస్మాకరావు, ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి రారాజు మాట్లాడుతూ, ప్రతిభ కనబరిచిన 33 మంది విద్యార్థులను నగదు పురస్కారాలతో సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
