భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ విజ్ఞప్తి
ఖానాపూర్, ఆంధ్రప్రభ: ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కోరారు.
వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు బయటకు వెళ్లవద్దని సూచించారు. కడెం డ్యామ్ దిగువ ప్రాంతాల్లో నివసించే గ్రామాల ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, గోదావరి పరివాహక ప్రాంతాలకు వెళ్లరాదని తెలిపారు.
ఖానాపూర్, కడెం, దస్తురాబాద్, పెంబి మండలాల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా పాల్కెరి వాగు, గోదావరి తీర ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ప్రభుత్వ అధికారులు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను పాటించి తమ భద్రతకు సహకరించాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ విజ్ఞప్తి చేశారు.
