Khammam | ఫాదర్స్ డే రోజున విషాదం..
- కుటుంబ కలహాలకు ఇద్దరు చిన్నారులు బలి
పాలేరు నియోజకవర్గం, ఆంధ్రప్రభ : తల్లిదండ్రుల మధ్య నెలకొన్న కుటుంబ కలహాల కారణంగా.. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల నిండు ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన ఖమ్మం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. ఫాదర్స్ డే రోజున జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగరాజు, స్వాతి దంపతులు నివాసం ఉంటున్నారు. గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన స్వాతి ఆదివారం (జూన్ 21న) ఉదయం తన ఇద్దరు కుమారులు వేదిక్ కుమార్ (7), తనిష్క్ (5)లకు బిస్కెట్లలో ఎలుకల మందు కలిపి తినిపించినట్లు తెలుస్తోంది.
విష ప్రభావానికి గురైన ఇద్దరు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం స్వాతి కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను వెంటనే ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ విషాదానికి కారణమా.. లేక మరేదైనా కారణాలున్నాయా.. అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
