ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగానే మార్గం…
- అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) దక్షిణ మధ్య జోన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. జోనల్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలోని ఆఫీసర్స్ క్వార్టర్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా “ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా” అనే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య జోన్ జోనల్ మేనేజర్ శరవణ రమేష్ ఎస్. మాట్లాడుతూ, యోగా కేవలం ఆయుష్షును పెంచడమే కాకుండా మంచి ఆరోగ్యంతో కూడిన జీవనాన్ని అందిస్తుందని అన్నారు. చురుకైన, ఉత్సాహభరితమైన జీవితాన్ని గడపాలంటే ప్రతిరోజూ యోగా సాధనను అలవాటు చేసుకోవాలని సూచించారు. వయస్సు పెరుగుదలతో వచ్చే శారీరక, మానసిక సమస్యలను తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
జోనల్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ ఎం. రవికుమార్ మాట్లాడుతూ, యోగా శరీరం, మనస్సు సమతుల్యతను కాపాడి ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడుతుందని తెలిపారు. రీజినల్ మేనేజర్ (మార్కెటింగ్) జి.కె.ఆర్.వి. రవికుమార్ మాట్లాడుతూ, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో యోగాకు ప్రత్యేక స్థానం ఉందని, ప్రతి ఒక్కరూ దాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు.
యోగా గురువు కరుణాకర్ పాల్గొన్న వారికి సులభంగా ఆచరించగలిగే పలు యోగాసనాలను ప్రదర్శించి వాటి ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో జోనల్ ఆఫీస్, హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల అధికారులు, ఉద్యోగులతో పాటు ఆఫీసర్స్ క్వార్టర్స్ నివాసితులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ (లీగల్) ఆర్. శరవణన్, సీనియర్ డివిజనల్ మేనేజర్ (సికింద్రాబాద్) ప్రభాత్ కుమార్ సాహు, సీనియర్ డివిజనల్ మేనేజర్ (హైదరాబాద్) కె. సంధ్యారాణి, రీజినల్ మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) డి.జె. శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
