ఫిట్‌గా ఉన్నా గుండెపోటు ఎందుకు ?

  • జిమ్‌కి వెళ్లేవారు ఈ తప్పులు అస్సలు చేయకండి!

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్ : గుండె ఆరోగ్యానికి వ్యాయామం చాలా అవసరం. కానీ రోజూ జిమ్‌లో గంటల తరబడి వ్యాయామం చేసేవారు, ప్రతి రోజూ రన్నింగ్‌ చేసేవారు, క్రికెట్‌ ఆడే క్రీడాకారులు ఆకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయారు అనే వార్తలను మనం ఈ మధ్య తరచూ వార్తాపత్రికల్లో, సోషల్‌ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఆరోగ్యంగా ఉండటం కోసమే మనం వ్యాయామాలు, రన్నింగ్‌, స్పోర్ట్స్ ఆడుతూ ఉంటాం. మరి ఇప్పుడు ఇంత ఫిట్‌గా ఉన్న యువకుల్లో కూడా గుండెపోటు రావడం ఆందోళన కలిగిస్తోంది.

దీంతో “వ్యాయామం చేసినా ప్రయోజనం ఏమిటి? ఫిట్‌నెస్ ఉన్నవారికి కూడా గుండె సమస్యలు వస్తాయా?” అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దీనికి ప్రధాన కారణం వ్యాయామం కాదు. చాలా సందర్భాల్లో ముందే ఉండి మనం గుర్తించలేని గుండె సమస్యలు, తీవ్రమైన శారీరక శ్రమలో బయటపడటమేనని వారు అంటున్నారు.

మనకు తెలియని మన గుండె జబ్బు..

జిమ్‌లో గుండెపోటుకు యువకుల్లో నిర్ధారణ కాని గుండె సమస్యలే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మనం వ్యాయామం చేసేటప్పుడు గుండె తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు ఈ సమస్యలు బయటపడి, తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తాయి. కానీ గుండెపోటుకు కచ్చితంగా వ్యాయామం మాత్రమే కారణం కాదు.

జిమ్‌లో దూకుడుతనం..

చాలా మంది సంవత్సరాల తరబడి వ్యాయామం చేయకుండా సాధారణ జీవనశైలికి అలవాటు పడి ఉంటారు. వారు హఠాత్తుగా వ్యాయామం ప్రారంభించి.. ఒకేసారి బరువైన వెయిట్ లిఫ్టింగ్, స్ప్రింటింగ్, హై-స్పీడ్ ట్రెడ్‌మిల్ వంటివి చేయడంతో గుండెపై ఆకస్మికంగా అధిక ఒత్తిడి పెరుగుతుంది. శరీరం తగినంత శిక్షణ లేకుండా ఇలా జిమ్‌లో అధిక బరువులు ఎత్తడం మంచిది కాదు. వ్యక్తిగత ఫిట్‌నెస్ స్థాయిలను పరిగణనలోకి తీసుకోకుండా, జిమ్‌లో ఇతరులతో పోటీ పడి వ్యాయామం చేయడం, ఆన్‌లైన్ ఫిట్‌నెస్ ట్రెండ్‌లను అనుసరించడం ఒక సాధారణ తప్పు.

విశ్రాంతి లేకుండా అతిగా శిక్షణ తీసుకోవడం గుండెపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది.వర్కవుట్ చేసే ముందు, చేసిన తరువాత వార్మప్, కూల్-డౌన్ సెషన్లను చేయకపోవడంతో గుండె స్పందన రేటు, రక్తపోటులో ఆకస్మిక మార్పులు సంభవించి గుండె ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాయామం చేసేటప్పుడు తగినంత నీటిని తీసుకోకపోవడంతో రక్తం చిక్కగా మారి, రక్త ప్రసరణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల వ్యాయామం చేసేటప్పుడు గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది.

గుండె పదిలంగా ఉండాలంటే..!!

కొత్తగా వ్యాయామం ప్రారంభించే వారు లేదా మధ్యలో ఆపేసి మళ్లీ మొదలు పెట్టే వారు తక్కువ వర్కవుట్‌లతో ప్రారంభించడం మంచిది. దీనివల్ల వ్యాయామానికి మీ గుండె అలవాటు పడటానికి తగిన సమయం లభిస్తుంది. ముఖ్యంగా మీరు కొత్తగా వ్యాయామం ప్రారంభిస్తుంటే, అధిక బరువు ఉంటే, లేదా 40 ఏళ్లు పైబడిన వారైతే ఖచ్చితంగా అనుభవజ్ఞుడైన జిమ్ ట్రైనర్ మార్గదర్శకత్వంలోనే వ్యాయామం చేయండి.

ముఖ్యంగా ట్రెడ్‌మిల్ ఉపయోగిస్తున్నప్పుడు మీ గుండె స్పందన రేటును అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వారానికి 5 రోజులు వ్యాయామం చేసి, కనీసం 2 రోజులు విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకోవడం వల్ల గుండె కండరాలు తమను తాము మరమ్మత్తు చేసుకునే సమయం లభిస్తుంది. విశ్రాంతి లేకుండా ప్రతిరోజూ తీవ్రమైన వ్యాయామాలు చేయడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది.

మన ఆహార అలవాట్లు అదుపులో..

గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించేందుకు మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చాలా అవసరం. జిమ్ చేసేవారు ఖచ్చితంగా పీచుపదార్థం (ఫైబర్) అధికంగా ఉండే ఆహారాలు తినాలి. తాజా కూరగాయలు, పండ్లు, గింజలు, మొలకెత్తిన విత్తనాలు ఆహారంలో భాగం చేసుకోవాలి.

అలాగే మీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. కొంతమంది జిమ్ చేసేవారు, అథ్లెట్లు, క్రీడాకారులు పూర్తిగా ఆరోగ్యంగా కనిపించినప్పటికీ, గుండెలో సూక్ష్మ స్థాయి లోపాలు ఉండవచ్చని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి సాధారణ ECG లేదా MRI పరీక్షల్లో కూడా ఒక్కోసారి కనిపించకపోవచ్చు.

నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలు…

  • వ్యాయామం చేసేటప్పుడు ఛాతిలో నొప్పి లేదా అసౌకర్యంగా అనిపించడం.
  • అకస్మాత్తుగా తల తిరగడం లేదా స్పృహ కోల్పోవడం.
  • వ్యాయామ సమయంలో అసాధారణమైన శ్వాస ఇబ్బంది (ఆయాసం) రావడం.
  • గుండె కొట్టుకోవడంలో అసమానతలు కనిపించడం.
  • కుటుంబంలో ఎవరికైనా చిన్న వయసులోనే గుండె సంబంధిత మరణాల చరిత్ర ఉండటం.

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

వ్యాయామం ఆపేయాలా?

గుండెపోటు సమస్య అనేది జిమ్ వర్కవుట్ వల్ల రాదు, దానిని చేసే విధానంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వ్యాయామం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం పెరగదు. అయితే ఎక్కువగా క్రీడలు, జిమ్ వర్కవుట్స్ చేసే ముందు బేసిక్ హెల్త్ చెకప్ పరీక్షలు చేయించుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

జిమ్, రన్నింగ్ లేదా క్రికెట్ వల్ల గుండెపోటు రావడం లేదు… ముందే ఉన్న గుండె సమస్యలు తీవ్రమైన శారీరక శ్రమ సమయంలో బయటపడటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అందుకే ఫిట్‌నెస్‌తో పాటు రెగ్యులర్ హెల్త్ చెకప్ కూడా అంతే ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు.