పంట అవశేషాలు తగలబెట్టే రైతులకు రూ.5 వేల జరిమానా

పంట అవశేషాలు తగలబెట్టే రైతులకు రూ.5 వేల జరిమానా

– వ్యవసాయ అధికారి వెంకన్న

కేసముద్రం, ఆంధ్రప్రభ:
పంట అవశేషాలను కావాలని తగలబెట్టే రైతులకు రూ.5 వేల వరకు జరిమానా తప్పదని కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి. వెంకన్న హెచ్చరించారు. సోమవారం ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇంటికన్నె గ్రామంలో సర్పంచ్ మంగ్త్య నాయక్ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి, మొక్కజొన్న వంటి పంటల అవశేషాలను కాల్చడం వల్ల భూమిలోని సూక్ష్మజీవులు నాశనం అవుతాయని, భూమి సారం తగ్గి పంట దిగుబడులు తగ్గుతాయని వివరించారు. అలాగే వాయు, నీరు, భూమి కాలుష్యం పెరిగి వాతావరణ మార్పులకు కారణమవుతుందని తెలిపారు.

పంట అవశేషాలను తగలబెట్టిన రైతులకు ప్రభుత్వ జీవో ప్రకారం రూ.5 వేల వరకు జరిమానా విధించబడుతుందని, పెద్ద మొత్తంలో కాల్చిన సందర్భాల్లో రూ.25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. వరి, పత్తి, మిరప వంటి సంప్రదాయ పంటలకు బదులుగా ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటలను సాగు చేయాలని తెలిపారు.

అలాగే నానో యూరియా, నానో డీఏపీ వినియోగం పెంచి ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రీలో భాగస్వాములై 11 అంకెల రైతు గుర్తింపు నంబర్ పొందాలని, దీని ద్వారా పీఎం కిసాన్, రైతు భరోసా, పంటల బీమా వంటి పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, హెచ్ఎం, వ్యవసాయ విస్తరణ అధికారి మంగ శ్రీనివాస్, జీపీఓ, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.