హైదరాబాద్‌లో డిజైన్–ఇన్నోవేషన్‌

ఆగస్టు 1, 2 తేదీల్లో బ్రహ్మాకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహణ

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: బ్రహ్మాకుమారీస్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్ వింగ్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మహదేవపూర్ గ్రామంలోని సైలెన్స్ రిట్రీట్ సెంటర్‌లో ఆగస్టు 1, 2 తేదీల్లో ‘సౌత్ ఇండియా డిజైన్ అండ్ ఇన్నోవేషన్ రెసిడెన్షియల్ సమిట్’ నిర్వహించనున్నట్లు బ్రహ్మకుమారి స్వర్ణలత తెలిపారు. చౌటుప్పల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ వివరాలను వెల్లడించారు.

‘డిజైన్ యువర్ డెస్టినీ’ ప్రధాన ఇతివృత్తంగా, “చైతన్యవంతమైన, సుస్థిరమైన భవిష్యత్తు కోసం రూపకల్పన” లక్ష్యంతో ఈ సమిట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సృజనాత్మకతకు ఆధ్యాత్మికతను జోడిస్తూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణమైన ఆలోచనలకు వేదికగా ఈ కార్యక్రమం నిలవనుందని పేర్కొన్నారు.

ఈ అంతర్జాతీయ స్థాయి సమిట్‌కు వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ మాజీ డైరెక్టర్ ప్రద్యుమ్న వ్యాస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. డిజైన్ అనేది కేవలం నిర్మాణాల సృష్టికే పరిమితం కాకుండా, జీవితాలను లక్ష్యబద్ధంగా, సామరస్యపూర్వకంగా తీర్చిదిద్దే ప్రక్రియ అని ఆయన సందేశమిచ్చారు.

సమిట్‌లో ఆర్కిటెక్ట్ పల్లవి అంచూరి, ఇండస్ యూనివర్సిటీ డిజైన్ విభాగాధిపతి డాక్టర్ రూపల్ జోషి, నిఫ్ట్ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ మాలిని దివాకల, టాటా తనిష్క్–మియా విభాగం ట్రెండ్స్ అండ్ డిజైన్ హెడ్ హేమ మాలిని తదితరులు పాల్గొని వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ రెసిడెన్షియల్ సమిట్‌లో డిజైన్ నెట్‌వర్కింగ్, ప్యానెల్ చర్చలు, యోగీలతో ముఖాముఖి, ఇన్నోవేటివ్ మెడిటేషన్ ల్యాబ్, మైండ్‌ఫుల్‌నెస్ సెషన్లు, డిజైన్ వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నారు. ప్రొడక్ట్ డిజైనర్లు, ఆర్కిటెక్ట్లు, ఇంటీరియర్, జ్యువెలరీ, గ్రాఫిక్, ఫ్యాషన్ డిజైనర్లు, ఐటీ నిపుణులు, ఇతర సృజనాత్మక రంగాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలు, నమోదు కోసం +91 94141 54600 నంబర్ లేదా www.bkdiwing.com వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.