మత సామరస్యంతో బక్రీద్ జరుపుకుందాం
మత సామరస్యంతో బక్రీద్ జరుపుకుందాం
- పోలీస్ కమిషనర్ సునీల్‌దత్
ఖమ్మం,ఆంధ్రప్రభ: బక్రీద్ పండుగను శాంతియుతంగా, మత సామరస్యంతో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పిలుపునిచ్చారు. ఈద్-ఉల్-అధా సందర్భంగా ముస్లిం మత పెద్దలు, మసీదు కమిటీ- సభ్యులు, ఖురేసి ప్రతినిధులతో మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే సమావేశ లక్ష్యమని తెలిపారు. పరస్పర గౌరవంతో పండుగను జరుపుకోవడం ద్వారా సమాజంలో శాంతి నెలకొంటుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. అధికారులతో సమన్వయం పాటించడం ఎంతో అవసరమని స్పష్టం చేశారు.
నిబంధనలకు లోబడి బలి..
గోవధ చేయరాదని, కేవలం అనుమతించబడిన జంతువులను మాత్రమే బలి ఇవ్వాలని కమిషనర్ సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. పశువులను తరలించేటప్పుడు సరైన ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పండుగ ఆనందాన్ని చట్టబద్ధంగా జరుపుకోవాలని సూచించారు. మతపరమైన ఆచారాలను గౌరవిస్తూ చట్టాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
భద్రత, నిఘా కట్టు-దిట్టం..
అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు అంతర్-రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద 24 గంటల నిఘా ఏర్పాటు- చేసినట్లు- తెలిపారు. జిల్లాలో కీలక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు- చేస్తున్నట్లు- వెల్లడించారు. మసీదులు, ప్రార్థనా స్థలాల వద్ద నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పారు. ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. భద్రతా చర్యలను మరింత కట్టు-దిట్టం చేయడం ద్వారా ప్రజల్లో విశ్వాసం కలిగించాలనుకుంటు-న్నామని అన్నారు. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలు సాధ్యమని పేర్కొన్నారు.
వదంతులపై కఠిన చర్యలు..
సోషల్ మీడియాలో వచ్చే రెచ్చగొట్టే వార్తలు, వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాంటి సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బలి అనంతరం జంతు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పరిశుభ్రతను పాటించడం ద్వారా ఆరోగ్య సమస్యలు నివారించవచ్చని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా డయల్ 100 లేదా కమాండ్ కంట్రోల్ సెల్ నెంబర్ 8712659111 కు సమాచారం అందించాలని కోరారు. సమావేశంలో ఏసీపీ రమణమూర్తి, మహేష్, సీఐలు కరుణాకర్, మోహన్ బాబు, బాలకృష్ణ, ఎస్సై మౌలానా పాల్గొన్నారు.
