హ్యామ్ నిధులతో భువనగిరి- చిట్యాల రోడ్డుకు మోక్షం
- హ్యామ్ రోడ్డు పనులకుపైలాన్ ఆవిష్కరణ చేసిన
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు
వలిగొండ, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామీణ రోడ్లకు,లింకు రోడ్లకు, జిల్లాలను కలుపుతూ ఏర్పాటు చేసే రోడ్లకు హైబ్రిడ్ యాన్యునిటీ మోడల్ (హ్యామ్ ) నిధుల ద్వారా రోడ్ల నిర్మాణం చేయనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారథ్యంలో భువనగిరి నకిరేకల్ ఎమ్మెల్యేల విన్నపం మేరకు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న డబల్ రోడ్డుగా ఉండి,ఎన్నో ప్రమాదాలకు కారణమైన భువనగిరి – చిట్యాల రోడ్డుకు ఎ ట్టికేలకు 100 ఫీట్ల నాలుగు లైన్ల రోడ్డుకు మోక్షం లభించింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం నుండి నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్న చిట్యాల హైవే రోడ్డు వరకు 40 కిలోమీటర్ల పరిధిలో రోడ్డుకు నాలుగు లైన్ల నిర్మాణం కోసం రెండు వందల 39 కోట్ల 75 లక్షల నిధులు హ్యామ్ లో మంజూరు అయ్యాయి.
భువనగిరి నుండి తుమ్మలగూడెం వరకు భువనగిరి నియోజకవర్గ పరిధిలో ని 25.8 కిలోమీటర్లకు 154.64 కోట్లు, తుమ్మలగూడెం నుండి చిట్యాల వరకు 14.2 కిలోమీటర్ల కు 85 కోట్ల 11 లక్షల రూపాయల తో రెండు బిట్లకు 4 లైన్ల కు 100 ఫీట్ల పనులకు ఇటీవలనే టెండర్లు పూర్తయ్యాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవ చూపుతుండడం వల్ల మొదటి దఫా లొనే ఈ రోడ్డు పనులు ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఆర్ అండ్ బి ఆధ్వరంలో హ్యామ్ నిధులతో చేపట్టనున్న నాలుగు లైన్ల రోడ్డు పనులు పూర్తయితే రెండు జిల్లాల మధ్య వాహనదారులకు ప్రయాణీలకు కష్టాలు తీరనున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భారీ వాహనాలు చిట్యాల హైవే నుండి వలిగొండ – భువనగిరి- తూఫ్రాన్ వద్ద హైవే రోడ్డులో కలుస్తాయి.
నిత్యం వందలాది వాహనాలు ఈ దారి గుండా వెళ్తుండడంతో సింగల్ రోడ్డు కావడంతో వలిగొండ మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. అధికంగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. రోడ్డు విషయాన్ని ఈ ప్రాంత ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం లు ఎప్పటికప్పుడు ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. ఉమ్మడి జిల్లా నల్లగొండ ఉన్నప్పుడు భువనగిరి ప్రాంత ప్రజలు జిల్లా కేంద్రకు వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడే వారు.
ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్ఎంబి శాఖ మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక చొరవ తోనే ఈ రోడ్లకు నిధులు మంజూరు అయ్యాయని ఈ ప్రాంత ప్రజలు ప్రయాణికులు అంటున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గతంలో భువనగిరి ఎంపీగా ఈ ప్రాంత ప్రజలు గెలిపించడం వల్ల భువనగిరి ప్రాంతంపై ఆయనకు ప్రత్యేక అభిమానం ఉందని ప్రజలు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం లకు రెండు నియోజకవర్గాల ప్రజలు ప్రయాణికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రోడ్డు పనులు త్వరలో ప్రారంభించేలా కృషి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
రోడ్లకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి,మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భువనగిరి – చిట్యాల నాలుగు లైన్ల రోడ్డు కు హ్యామ్ ధ్వారా 239.75 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లకు నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రయాణికుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలుతెలియజేస్తున్నానని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి చిట్యాల నాలుగు లైన్ల రోడ్డు వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పుతాయని అన్నారు. రోడ్డు పనులు కూడా త్వరగా ప్రారంభమవుతాయని అన్నారు. కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వం అన్నారు.ప్రజా ప్రభుత్వం లో నియోజకవర్గంఅన్ని రంగాలలో అభివృద్ది చెందుతుందన్నారు.
