ప్రభుత్వం సూచించిన వరి రకాలను సాగు చేయాలి..

తొర్రూరు, ఆంధ్రప్రభ : ప్రభుత్వం సూచించిన వరి రకాలను సాగు చేసి ప్రయోజనం పొందాలని ఏడీఏ శ్రీదేవి తెలిపారు.డివిజన్ కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విత్తన మేళను
ఏడీఏ సందర్శించారు.రైతులకు పలు రకాల విత్తనాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ…ప్రభుత్వం సూచించిన వరి రకాలను మాత్రమే సాగు చేయాలని, వర్షాధారిత పరిస్థితులను బట్టి స్వల్పకాలిక లేదా మధ్యకాలిక పంటలను ఎంచుకోవాలన్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన 7 వరి రకాలను సాగు చేయాలని, వాటికే ప్రభుత్వం రూ.500 బోనస్ అందిస్తుందని తెలిపారు.

నీటి ఎద్దడి ఉన్నప్పుడు పప్పుధాన్యాలు సాగు చేయాలని సూచించారు. యూరియాను సిఫార్సు చేసిన మోతాదులో పలు దఫాలుగా వాడాలని రైతులను కోరారు. ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు యంత్రాంగం పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉందన్నారు. రైతులు అంతర పంటలు, తక్కువ నీటితో పండే పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు.రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా, కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లు, విత్తన ట్యాగ్ లను తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తొర్రూరు,పెద్ద వంగర ఏవోలు రామ నరసయ్య,స్వామి నాయక్, స్థానికులు, రైతులు పాల్గొన్నారు.