భారీగా తరలిన అధికారులు, కార్మికులు

భారీగా తరలిన అధికారులు, కార్మికులు

  • ప్రభుత్వం తరఫున రూ.15 కోట్ల నిధులు
  • కూటమి ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం

శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) కర్నూలు జిల్లా పర్యటన శ్రీ సత్యసాయి జిల్లా అధికారులకు, కార్మికులకు ఒక సవాలుగా మారింది. ప్రధాని కర్నూలు జిల్లా పర్యటన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని పర్యటన కోసం ప్రత్యేకంగా రూ 15 కోట్లు నిధులు(funds) సైతం మంజూరు చేసింది. సాధారణంగా ప్రధాని, రాష్ట్రపతి వంటి వారు ఆయా ప్రాంతాలకు వివిధ పర్యటనలకు వచ్చిన సందర్భంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసు సిబ్బందిని ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోవడం సహజం.

కానీ పోలీసు సిబ్బందితోపాటు వివిధ శాఖల అధికారులు ముఖ్యంగా మున్సిపల్ శాఖ(Municipal Department) కమిషనర్లను, అధికారులను, ఉద్యోగులను, పారిశుద్ధ్య కార్మికులను పెద్ద ఎత్తున ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు పర్యటన సందర్భంగా కర్నూలుకు తరలించడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 16 మంది మున్సిపల్ కమిషనర్ల(Commissioners)ను ప్రతి మున్సిపల్ పరిధి నుంచి సుమారు 100 మంది వరకు సిబ్బందిని కర్నూలుకు మూడు రోజులు ముందుగానే తరలిస్తున్నారు. దీంతో అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు ఎప్పుడు ఏ సమస్య వచ్చి పడుతుందో అనే ఆందోళనలో వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు పర్యటనకు వస్తున్న సందర్భంగా ప్రధాని సభకు కేవలం మహిళలనే 50 వేల మందిని జన సమీకరణ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఆయా జిల్లాలోని మహిళా పొదుపు సంఘాలకు బాధ్యత వహిస్తున్న అధికారులకు, సిబ్బందికి ఇందుకు సంబంధించిన ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.

మహిళలను స్థానికంగా జన సమీకరణ చేయడం సులభమే. కానీ ఇతర ప్రాంతాల నుంచి మహిళలను సమీకరించాలంటే పలు సమస్యలతో కూడుకున్న అంశంగా భావించవచ్చు. ఇలాంటి సందర్భంలో మహిళల(Women)ను ఏ విధంగా ఇతర ప్రాంతాల నుంచి సమీకరించాలనేది సంబంధిత మహిళ అధికారులకు అంతుచిక్కని అంశంగా ఉందనే చర్చ సర్వత్రా సాగుతోంది .ఇలాంటి సందర్భంలోనే ఎంకి పెళ్లి సుబ్బడి సావుకు వచ్చిందనే సామెత పుట్టిందేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Leave a Reply