ఇండ్ల స్థలాల పంపిణీలో ప్రభుత్వం వైఫల్యంతోనే భూపోరాటాలు..

ఇండ్ల స్థలాల పంపిణీలో ప్రభుత్వం వైఫల్యంతోనే భూపోరాటాలు..

  • సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
  • కలెక్టరేట్ ఎదుట సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో భారీ ధర్నా

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్ : ఇండ్ల స్థలాల పంపిణీలో ప్రభుత్వ వైఫల్యంతోనే పేదలు భూపోరాటాలు నిర్వహిస్తున్నారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ఈ ధర్నాకు వామపక్షాల నాయకులు, పెద్ద సంఖ్యలో పేద ప్రజలు, మహిళలు తరలివచ్చారు.ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు హాజరై మాట్లాడుతూ.. భూపోరాటాల ద్వారా ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకుని దశాబ్దాలుగా నివాసముంటున్న, నిరుపేదలైన ప్రజలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆయన మండిపడ్డారు.

ఒకవైపు పేదలకు గూడు లేక ఇబ్బంది పడుతుంటే, మరోవైపు విలువైన ప్రభుత్వ భూములు ల్యాండ్ మాఫియా పరం అవుతున్నాయని ఆరోపించారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి హనుమకొండ జిల్లాలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని, లేనిపక్షంలో వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇండ్ల స్థలాల కోసం, పక్కా ఇండ్ల నిర్మాణం కోసం ఏండ్ల తరబడి పేదలు పోరాడుతూనే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా పేదలు, బడుగు బలహీన వర్గాలు నివసించేందుకు స్థలం లేక, పక్కా ఇల్లు లేక, దుర్భర జీవితం గడుపుతున్నారని అన్నారు.

అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితి దాపురించిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్లస్థలంతో పాటు పక్కా ఇల్లు నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, కానీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దీనిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి పేద ప్రజలను ఆదుకోవాలని కోరారు. పేదలకు, ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, సిపిఎం జిల్లా నాయకులు ఎం. చుక్కయ్య అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు,కర్రె బిక్షపతి, జి.ప్రభాకర్ రెడ్డి,సిపిఐ రాష్ట్ర సమితి సభ్యురాలు మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, మండల కార్యదర్శి ఎన్. అశోక్ స్టాలిన్, కార్యవర్గ సభ్యులు ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, మునిగాల బిక్షపతి, జక్కు రాజు గౌడ్,నేదునూరి రాజమౌళి, వేల్పుల సారంగపాణి, బత్తిని సదానందం,రాసమల్ల దీన, సిపిఎం జిల్లా నాయకులు బొట్ల చక్రపాణి, వీరన్న, మంద సంపత్, గొడుగు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.