పోషకాహారమే విద్యార్థుల విజయానికి పునాది
- కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
- డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం తనిఖీ
- విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యత పరిశీలన
నందిగామ, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద అందిస్తున్న పోషకాహారంతో కూడిన భోజనాన్ని ప్రతి విద్యార్థి తప్పనిసరిగా భుజించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సూచించారు. సమతుల ఆహారం విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడుతుందని, విద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కూడా ఇది ఎంతో అవసరమని పేర్కొన్నారు.
గురువారం నందిగామ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తున్నారా అనే విషయాన్ని స్వయంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు.
వంటశాల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, వంట ప్రక్రియ, నిల్వల పరిస్థితి, కిచెన్ నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్, పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే ఆహార నిల్వల రిజిస్టర్లు, స్టాక్ వివరాలు, విద్యార్థుల హాజరు నమోదులను కూడా తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పోషక విలువలు కలిగిన సమతుల ఆహార మెనూను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ప్రతి విద్యార్థి పాఠశాలలోనే తప్పనిసరిగా భుజించాలని సూచించారు. సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల శారీరక ఎదుగుదలతో పాటు మానసిక వికాసం కూడా మెరుగుపడి చదువులో మంచి ప్రతిభ కనబర్చేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.
ముఖ్యంగా బాలికలు మధ్యాహ్న భోజనాన్ని నిర్లక్ష్యం చేయకుండా పాఠశాలలోనే భుజించాలని సూచించారు. పెరుగుతున్న వయస్సులో సరైన పోషకాహారం ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుందని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ఆధునిక వసతులు కల్పిస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించి బోధన అందిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడేలా ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపడుతోందని చెప్పారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో ఎ. అనిల్ కుమార్, తహసీల్దార్ నూతక్కి సురేష్ బాబు, ఎంపీడీవో వరప్రసాద్, ఎంఈఓ పద్మ, రెవెన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
