Kadam ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలి: సర్పంచ్ దీకొండ విజయ్
Kadam ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలి: సర్పంచ్ దీకొండ విజయ్
- పెద్దూరు గ్రామసభలో వర్షాకాల వ్యాధులపై అవగాహన
కడెం (Kadam), ఆంధ్రప్రభ:
పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని పెద్దూరు గ్రామపంచాయతీ సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు.బుధవారం కడెం మండల కేంద్రంలోని పెద్దూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామసభను ఆయన అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ దీకొండ విజయ్ మాట్లాడుతూ వర్షాకాల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని సూచించారు. పరిశుభ్రత పాటించకపోతే వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని తెలిపారు.
కడెం మండల వ్యవసాయ అధికారి దినేష్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వ్యవసాయ శాఖ సూచించిన పంటలను మాత్రమే సాగు చేయాలని సూచించారు. ఆరుతడి పంటలు సాగు చేయడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.
గ్రామసభలో తాగునీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ సమస్యలపై చర్చించారు. సంబంధిత అధికారులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిట్టల రాజన్న, ఎంపీఓ శ్రీనివాస్, పశువైద్యాధికారి డాక్టర్ సౌందర్య, పంచాయతీ కార్యదర్శి మునరోల్ హసన్, ఏఎల్‌ఎం రెబ్బ శ్రీనివాస్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
