june14sunday2026|ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

june14sunday2026|ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

june14sunday2026 | పిక్‌నిక్‌లోని అసలైన మజా ఏమిటి?
బిజీ జీవితంలో కనుమరుగవుతున్న కుటుంబ సమయం
మొబైల్‌ల మధ్య పెరుగుతున్న మనసుల దూరం
కుటుంబ బంధాలకు పిక్‌నిక్‌లు ఎందుకు అవసరం?
పిల్లలకు జీవితాంతం గుర్తుండే జ్ఞాపకాలు
పిక్‌నిక్ అంటే దూర ప్రయాణమే కాదు
జ్ఞాపకాలే జీవితంలో అసలైన సంపద

june14Sunday2026
june14Sunday2026

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మీకు బ్రహ్మోత్సవం సినిమాలోని పిక్ నిక్ పాట, సన్నివేశం గుర్తుందా? కుటుంబమంతా కలిసి లగేజ్‌తో పిక్‌నిక్‌కు వెళ్లడం… ఆటపాటలతో సందడి చేయడం… పిల్లలు, పెద్దలు కేరింతలు కొడుతూ ఆనందంగా గడపడం… బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తూ, పార్కుల్లో, పచ్చటి పొలాల్లో తిరుగుతూ మురిసిపోవడం

యెస్… పిక్‌నిక్‌లోని అసలైన మజా అదే!

ఆ సినిమా, ఆ పాట చూసిన చాలా మంది ఒకసారి అయినా అనుకుని ఉంటారు… “మనమూ ఇలా కుటుంబమంతా కలిసి ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది!” అని. కానీ ఆ ఆలోచన ఆలోచనగానే మిగిలిపోతుంది.

ఎందుకంటే నేటి జీవితం పూర్తిగా మారిపోయింది. ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో పనిలో బిజీ. పిల్లలకు స్కూల్స్, కాలేజీలు… యువతకు ఉద్యోగాలు… పెద్దలకు వ్యాపారాలు, బాధ్యతలు… ఇలా ఎవరి ప్రపంచం వారిదే అయిపోయింది. ఒకే ఇంట్లో ఉంటూ కూడా అందరూ కలిసి కూర్చుని భోజనం చేయడం కష్టమైపోతున్న రోజులివి. అలాంటప్పుడు కుటుంబమంతా కలిసి ఒకరోజంతా గడపడం సాధ్యమేనా? అదీ ముఖ్యంగా మొబైల్ ఫోన్లకు దూరంగా?

అవును… సాధ్యమే. అంతేకాదు, అది ఈ కాలంలో అత్యవసరం కూడా.

మనుషుల మధ్య దూరాలు ఒక్కసారిగా పెరగవు. నిత్యజీవితంలోని పరుగులు, ఒత్తిడులు, బాధ్యతలు నెమ్మదిగా మనల్ని ఒకరికి ఒకరిని దూరం చేస్తాయి. ఒకే ఇంట్లో ఉంటూ కూడా మనసులు వేరుపడే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులంతా కలిసి ఒక చిన్న ప్రయాణం చేయడం, ప్రకృతి మధ్య కొంత సమయం గడపడం, కూర్చుని మనసు విప్పి మాట్లాడుకోవడం అనేది సంబంధాలకు కొత్త ఊపిరి పోసినట్టే.

మానసిక శాస్త్రవేత్తలు కూడా ఇదే చెబుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా అపార్థాలు, చిన్నచిన్న విభేదాలు, భావోద్వేగ దూరాలు ఏర్పడినా… వాటిని తగ్గించడంలో పిక్‌నిక్‌లు, కుటుంబ విహార యాత్రలు ఎంతో ఉపయోగ పడతాయని వారు పేర్కొంటున్నారు. ఇవి కేవలం వినోదం మాత్రమే కాదు… కుటుంబ బంధాలను మరింత బలపరిచే అమృతక్షణాలు.

ముఖ్యంగా పిల్లలకు ఇలాంటి అనుభవాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఖరీదైన బహుమతుల కంటే, తల్లిదండ్రులతో కలిసి గడిపిన సంతోషకరమైన క్షణాలే వారి జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలుస్తాయి. ఒకప్పుడు మనం చిన్నప్పుడు బంధువులందరితో కలిసి వెళ్లిన విహార యాత్రలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటాం. అదే జ్ఞాపకాలను నేటి తరానికి కూడా అందించాల్సిన బాధ్యత మనదే.

పిక్‌నిక్ అంటే తప్పనిసరిగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటికి దగ్గరలోని పార్క్ అయినా, సరస్సు ఒడ్డైనా, ఒక చిన్న పచ్చటి ప్రకృతితో అలరారే ప్రదేశమైనా సరిపోతుంది. ముఖ్యమైనది ప్రదేశం కాదు… కలిసి గడిపే సమయం.

అందుకే ఈ పిక్‌నిక్ డే సందర్భంగా ఒక నిర్ణయం తీసుకుందాం. వారానికి కాకపోయినా, నెలకోసారి అయినా కుటుంబమంతా కలిసి కొంత సమయం గడిపేద్దాం. ఆ కొన్ని గంటలు మొబైల్ ఫోన్లను పక్కన పెట్టి, మనుషులను మనుషుల్లా కలుద్దాం. నవ్వుకుందాం… మాట్లాడుకుందాం… జ్ఞాపకాలు సృష్టించుకుందాం.

ఎందుకంటే జీవితాంతం గుర్తుండేది మన సంపాదన కాదు… మనతో కలిసి నవ్విన మనుషులు, వారితో గడిపిన ఆనంద క్షణాలే.

+++++++++++++++++++

హద్దులున్నాయి

మన చిన్న తనంలో తెర మీద హీరో హీరోయిన్ లని , నటుల్ని చూసి తెగ మురిసిపోయే వాళ్లం . అలాంటి వారు మనకు బయట కనిపిస్తారా ఒక వేళ కనిపించినా మన లాంటి సామాన్యులతో మాట్లాడుతారా అని అనిపించేది . వాళ్ళను పేపర్ల లో , టీవీల్లో చూసి సంతోష పడే వాళ్ళం . తర్వాత్తర్వాత వాళ్ళని ఎప్పుడైనా కలిసే అవకాశం దొరికితే అదృష్టం లా ఫీల్ అయి వారిని ఆరాధన గా చూసే వాళ్ళం .
కానీ కాలక్రమేణా వచ్చిన మార్పులతో ఆ తెర వేల్పులు నేల మీదకు దిగి రావడం మొదలు పెట్టారు . జనసామాన్యంలో కలవడం మొదలు పెట్టారు .


కొందరు టీవీ షో లకి వస్తూ అందరితో కలవడం చేస్తున్నారు . ఇంకొందరు రాజకీయాల్లోకి ప్రవేశించి జనం మధ్యలో తిరుగుతున్నారు . ఇలా చేయడం వల్ల వాళ్ళ విలువ , క్రేజ్ కొంచెం తగ్గిన మాట వాస్తవమే .
అయితే ఈ మధ్య సోషల్ మీడియా కూడా విజృంభించడం మొదలు అయింది కదా .
దాని వల్ల వారి వ్యక్తిగత విషయాలు కూడా అందరికీ బాగా తెలుస్తున్నాయి . వారి లోని గొప్పదనమే కాకుండా లోపాలు కూడా అందరి ముందు ప్రదర్శనకు వస్తున్నాయి . దీంతో వారి మీద ఒక రకమైన చులకనభావం పెరగసాగింది జనాల్లో . అది అక్కడితో ఆగితే పర్వాలేదు కానీ నోటికొచ్చినట్టు కామెంట్లు చేయడం మొదలు పెట్టారు జనాలు .


ఎంతో కష్టపడి తమలోని కళను డెవలప్ చేసుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కి ఆ స్థాయికి వచ్చిన ప్రముఖులు , ఎందుకూ పనికిరాని ఒక పనికిమాలిన వెధవ తో కూడా మాటలు అనిపించుకుంటున్నారు .
దీనికి కారణం ఆ ప్రముఖులు ఈ సోషల్ మీడియా దయవల్ల అందరికీ అందుబాటులో ఉండటం వల్లనే . ప్రతీ మనిషి జీవితంలోనూ లోపాలు ఉన్నట్టే వారికీ ఉంటాయి కదా . కానీ ఆ విషయాన్నీ విస్మరించి వాళ్ళని బూతులు తిడుతూ ఉంటారు ఈ జనాలు . ఇది మంచి పధ్ధతి కాదు అని నా అభిప్రాయం . ఆ సెలెబ్రెటీ లు మనకు ఎంత దగ్గరగా వచ్చినా మన హద్దుల్లో మనం ఉండాలి అని , పధ్ధతి గా మాట్లాడాలి అని నా అభిప్రాయం . నాతో మీరు ఏకీభవిస్తారు కదా ఫ్రెండ్స్ !!!!

+++++++++++++++++++++++++++++++++++

అధిక్షేప హాస్యం, ఆమె కోణం

Prologue :

సూత్రధారుడు:

Making it clear to the meanest intelligence , అంటే…

సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా స్పష్టంగా చెప్పడం, లేదా

అత్యంత నీచమైన తెలివికి కూడా స్పష్టంగా అర్థం అయ్యేలా తెలియచేయడం. క్లాస్ లో విద్యార్ధులకు పాఠం చెప్పినంత తేలిక కాదు, నిజ జీవితంలో సమస్యలు ఎదుర్కోవడం!

సీన్ : 1
(డిగ్రీ తరగతి గది, బ్రేక్ టైమ్)
నలుగురు అమ్మాయిలు చిట్టీలలో తమ కోరికలు రాసుకున్నారు. నలుగురు అమ్మాయిలు వారి భవిష్యత్ కోరికలు రాసుకున్నారు. రాక్ పేపర్ సీజర్ ఆడి ఒకరి తర్వాత ఒకరు చిట్టీలు తీసుకుంటున్నారు. ముందు యామిని నెగ్గి, ఒక చిట్టీ తీసింది

యామిని : వచ్చే ఐదు సంవత్సరాల లోపు ప్రపంచంలో ఉన్న ఏడు వింతలు మా ఆయన నాకు చూపించాలి
శిరీష(ఈమె ఆటలో భాగం కాదు, ప్రేక్షకురాలు): ఎవరు రాసారు ఇది ? నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా, ఇవే కోరికలు మీ నాన్నను, మీ అన్నయ్యలను అడగ వొచ్చు కదా! (అని కావ్య వైపు చూసింది. కావ్య చిరు కోపంతో కళ్ళు అటువైపు తిప్పింది).

యామిని : తప్పే, వాళ్ళకు ఆ తాహతు లేదు కదా.
(తర్వాత ధన్వి చిట్టీ తీసింది)

ధన్వి : రిచెస్ట్ కారు కొనాలి, దాని మీద మా అమ్మమ్మ గారి ఊరు వెళ్లాలి. అందరూ నన్ను ఆశ్చర్యంగా చూడాలి. ముఖ్యంగా ఆ కుళ్ళుబోతు కవిత. అది వాళ్ళింట్లో బ్లూ కారుని నన్ను కనీసం ఆడుకునేటప్పుడు కూడా ముట్టుకోనివ్వదు. అది నా కారుని చూసి రెండు రోజులు అన్నం తినకూడదు! ( ఎవరు రాశారు ఇది?! అని స్వగతంగా అనుకుని అందరినీ అనుమానంగా చూసింది)

కావ్య : నాకు పెళ్ళి అయ్యాకా మా ఆయన నాకు మా అమ్మకు ఐ ఫోన్ లు కొని ఇవ్వాలి.

మేఘన : నాకు పెళ్ళి అయ్యాకా మా ఆయన నన్ను బాగా చూసుకోవాలి. నా కోపం అర్ధం చేసుకోవాలి. ప్రతీ రోజూ షాపింగ్ కు తీసుకు వెళ్లాలి. కొత్త సినిమాలు రిక్లైనర్ సీట్లో బుక్ చేసి చూపించాలి.

సీన్ : 2
స్టేజ్ నాలుగు భాగాలుగా విభజించ బడి ఉంది, మేఘన, కావ్య, ధన్వి, యామిని అందరూ తలో చోట కూర్చున్నారు
మేఘన, ఆమె భర్త శంకర్, ఒక లాయర్, మేఘన తల్లితండ్రులు, శంకర్ తల్లితండ్రులు, ఇంకా ఒకరిద్దరు పెద్దలు ఉన్నారు, వాళ్ళ అవసరం ఉంది అన్నప్పుడు వచ్చి మాట్లాడి వెళ్తున్నారు. అదే పెద్దలు అందరికీ … represent చేస్తారు, ఒక గందర గోళం, ఒక స్పష్టత, కొంచం కన్ఫ్యూషన్ అన్నీ కలిసి అక్కడ రాజ్యం ఏలుతున్నాయి.

మేఘనతో పాటు తన మిగతా ముగ్గురు స్నేహితురాళ్ళు స్పష్టంగా ఉన్నారు. లాయర్ తో అంటోంది.

మేఘన : నాకు ఈ వెధవ మొగుడు వద్దు అండి.

లాయర్ నారాయణ : ఒక్క genuine కారణం చెప్పండి మీరంతా, చట్టానికి కావాలి.

మేఘన : మొన్న రిలీజ్ అయ్యిన సినిమాకి మొదటి రోజు Recliner seat బుక్ చెయ్యలేని సన్నాసి వీడు నాకు వొద్దు.

కావ్య : ఐ ఫోన్ కొనమంటే డొక్కు ఫోన్ కొన్నాడు, ఈ మొగుడు నాకు వొద్దు,

యామిని : వెయ్యి సార్లు అడిగా, విమానం ఎక్కాలి, కనీసం సింగపూర్ తీసుకెళ్ళు అని, ఇంకో ఐదు ఏళ్ళు బాగా సంపాదించాలి, అప్పుడు చూద్దాం అని ముద్దుగా చెబుతున్నాడు. కనీసం గోవాకి కూడా తీసుకువెళ్లలేదు. ఇంకెందుకు ఈ మొగుడు, గోళ్ళు గిల్లుకోవడానికా?!

ధన్వి : నా మొగుడు ఇంకా బెంజి, ఆడి కారు కొనలేదు. నాకు నమ్మకం లేదు. Waste. My life is so precious. విడాకులు కావాలి, ఇంకొకన్ని చూసుకుంటా. చేసుకుంటా, లేదా కలిసి ఉండి… ఆలోచిస్తా.

సీను 3 :

స్టేజ్ మీద ఒకవైపు నుంచి రెడ్ కలర్ తో, యధార్థ వాది లోక విరోధి అని బోర్డ్ ఒకరు diagonal నడిచి వెళ్ళి చెబుతారు, ఇంకో వైపు నుంచి పెళ్లి అనే వ్యవస్థ ఒక పాత చింతకాయ పచ్చడి, దానిని మ్యూజియంలో పెట్టాలి. ఇంకొకరు పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని వెళ్తారు. ఇంకో వైపు నుంచి పెళ్లి అంటే నాలుగు ఏళ్ల పెంట, కోర్టుల వెంట తంటా, విడాకుల అంట, భరణం పెంట, దోపిడీ అంట!…, ఇలా కోరస్, కుదిరితే…వీటి వ్యంజనంతో చిన్న పాట, Awareness.

సీన్ : 4

ఇంకో ఏభై ఏళ్ళు గడిచాయి, మేఘనతో పాటు అందరూ ముసలివాళ్ళు అయ్యారు, అందులో ఇద్దరికీ పిల్లలు ఉన్నారు, అమెరికాలో, ఇంకో ఇద్దరు పిల్లలు వొద్దు అనుకున్నారు.

నలుగురు చాలా ఖరీదు అయిన వృద్ధాశ్రమంలో ఉన్నారు.

యామిని : నేను ఒక మాట అడుగుతాను, మనం పెళ్ళికి ముందు యవ్వనంలో ఎన్నో కోరికలతో ఉన్నాము. అన్నీ పెళ్ళితో ముడి పెట్టాము. మొత్తం మొగుడు, భర్త చూసుకోవాలి అని మొత్తం బరువు వాడి కోసం అలా అట్టే పెట్టాం!

కావ్య : నిజం, మన తండ్రి, మన అన్న మనకు ఏం చేయకపోయినా మనకు కోపం లేదు,

ధన్వి : మన తల్లితండ్రులు, వారి ఆర్థిక పరిస్థితి, మనకు తెలుసు, అందుకే మన తీరని కోరికలు, ఫాంటసీలు ..

మేఘన : అన్నీ భర్త మీద పెట్టాము. మనం అందరం మొగుడిని కాదు, ఒక Superman, హీ మెన్, గొప్పవాడు, Spiderman, ఇంకా ఏవేవో ఊహించుకున్నాం.

సూత్రధారుడు ప్రవేశం,

ఆంగికం భువనం యస్య, వాచకం సర్వ వాఙ్మయం…., యద్భావం తద్భవతి…, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన…,

మర్చిపోయారా స్నేహితులారా, భర్త కూడా ఇంకో ఇంట్లో కొడుకు, అన్న, తమ్ముడు…, మీ ఇంట్లో లాగే! పదివేల మందిలో కూడా ఒక Superman ఉండడు. అది చాలా అరుదు. మీ సంపాదనతో, మీ ఆశయాలతో మీరు మీ కోరికలు తీర్చుకుంటే సరే! కానీ మీ Fantasies కి, తీరని చీకటి కోరికలకు, ఇంకా చెప్పలేని మీ రహస్య వాంఛలకు అన్నిటికి భర్తను బాధ్యత వహించమంటే, ధర్మం కాదు కదా!

అన్ని చోట్ల అధిక్షేపం, ప్రేమతో భగ వంతుణ్ణి తిట్టినట్టు నటిస్తూ అడగ వచ్చు. “…ఇంత వల పక్షమేల శ్రీకాంత నీకు అంటూ..”. కానీ వర్తమాన జీవితంలో మనుషులు బంధాలలో పడి, నలిగి, నశించి తగలబడి బోతున్నారు, అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అంతా “ఆమె” కోణంలో చూడాలి అంటే ఎలా?!

సత్యానికి రెండో కోణం కూడా ఉంటుంది, అధిక్షేపం అతని కోణం.

అప్పుడే సమస్య సామాన్యులకు కూడా అర్థం అవుతుంది. నిజమైన పచ్చని సంసారాలు, పచ్చని బంధాలు భూమిపై వెలుగుతాయి! ప్రేక్షుకురాలు శిరీష Curtain call అంది. అందరూ కృతజ్ఞతతో అభివాదం చేశారు.

సత్యమేవ జయతే.

తిరుమలేశుని వస్త్రాలంకరణ విశేషం

అలంకార ప్రియో హరిః అన్న పురాణోక్తి కి తగినవిధంగానే తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తి కి ధరింప చేసే స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో పాటు చేసే వస్త్రాలంకారణల్లో ఎన్నో విశేషాలున్నాయి. ఆ విశేషాలకు తగిన విధంగా పేర్లు కూడా ఉన్నాయి.
స్వామి కి శుక్రవారాభిషేకం అనంతరం ధరింపచేసే పంచె ను మేల్ చాట్ వస్త్రం అని అంటారు. దీపావళి, ఉగాది వంటి పర్వదినాల్లో స్వామి వారికి తలపాగా లో చుట్టే 2 గజాల వస్త్రాన్ని పరివట్టం (ఉపరివస్త్రం) అని, భుజాల నుంచి పాదాల వరకు వేలాడే వస్త్రాన్నితోమాల ఉత్తరీయం అని, నడుము మీద వేలాడే సూర్య కటారి మీదుగా ధరింప చేసే వస్త్రాన్ని అడ్డ తోమాల అని, పంచె గా ధరింప చేసే వస్త్రాన్ని పీతాంబరం అని అంటారు.

సాధారణంగా స్వామి కిరీటాన్ని అమర్చేందుకు తలపాగా లాగా చుట్టే వస్త్రాన్ని గద్వాల ఎరవాడ అని అంటారు. . స్వామి కి ధరింపచేసే పట్టు పంచలు జారిపోకుండా ఉండేందుకు నడుముకు పట్టీలా ధరింపచేసే వస్త్రాన్ని ఉల్చాటు వస్త్రం అని అంటారు. అభిషేక సమయంలో స్వామికి లంగోటా లా ధరింప చేసే వస్త్రాన్ని కౌపీన వస్త్రం అంటారు. స్వామి వారి వక్ష స్థలంలోని శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు ధరింపచేసే చిన్న పట్టు వస్త్రాలను దుపట్టా వస్త్రం అని, ప్రతి బుధవారం అమ్మవార్లకు ధరింపచేసి విశేష వస్త్రాలను బట్మల్ పావడ అని అంటారు. ఈ విధంగా స్వామి వారి మూలమూర్తికి ఒకసారి ధరింప చేసిన వస్త్రాలను మరో సారి ధరింప చేయరు. ఎప్పటికప్పుడు కొత్త వస్త్రాలనే వినియోగిస్తారు. ఆ వస్త్రాలను ఇతర అనుబంధ ఆలయాలకు పంపడమే కాక స్వామి ని దర్శించుకునే ప్రముఖులకు వస్త్ర బహుమానం రూపంలో అందచేస్తారు.

ఓం నమో వెంకటేశాయ

click here for more