భక్తి వైభవాన్ని చాటుతున్న ఆషాఢ సారె..
- ఇంద్రకీలాద్రికి పోటెత్తిన మహిళా భక్తులు
- 22వ రోజు అమ్మవారి సన్నిధిలో భక్తుల రద్దీ
- 44 సారె బృందాల రాక
- 18,904 మంది భక్తులు సారె సమర్పణ
- సారె బృందాలకు ఉచిత దర్శనం, ఆశీర్వచనం
- భక్తులతో కలిసి మొక్కులు చెల్లించిన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ ఆషాఢ సారె మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. 22వ రోజు బుధవారం అమ్మవారిని ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావించిన మహిళా భక్తులు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారెలతో పెద్దఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భక్తి వాతావరణంతో కళకళలాడింది.
దేవస్థానం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 44 సారె బృందాల్లో 18,904 మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. రాష్ట్రంలోని పలు కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కాలనీల నుంచి మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. సారె బృందాలకు దేవస్థానం ఉచిత దర్శనం, ఆశీర్వచనం ఏర్పాటు చేసింది. దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ సారె బృందాలతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆషాఢ సారె ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతుండగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, క్యూలైన్లు, ఇతర సౌకర్యాలను దేవస్థానం విస్తృతంగా ఏర్పాటు చేసింది. సాయంత్రం వరకు ఆలయానికి భక్తుల రాక నిరంతరంగా కొనసాగింది.
